కోరుట్ల, జూలై 31 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి కేవలం రెండు నెలల్లో డబ్బులు అందించారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గుర్తు చేశారు. కానీ, కాంగెస్ పాలనలో నెలలు గడిచినా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ పథకం సంతానలక్ష్మి మారిందని ఎద్దేవా చేశారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఇబ్బంది పెట్టకుండా సకాలంలో డబ్బులు అందించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కోరుట్ల పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో 24 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందజేశారు. పలువురు లబ్ధిదారులను ఈ పథకానికి ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారు? అని ఎమ్మెల్యే ప్రశ్నించగా, తొమ్మిది నెలలు గడిచిందని వారు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరికి ఏడాది దాటినా చెక్కులు మంజూరు చేయడం లేదని, మరికొందరికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా కల్యాణలక్ష్మి డబ్బులు అందని దుస్థితి నెలకొందన్నారు.
దీంతో దళారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారని, ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని మహిళలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అసమర్థ సీఎం రేవంత్ పాలన తీరుకు ఇది నిదర్శనమని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో పథకాలు అర్హులందరికీ చేరాయని గుర్తు చేశారు. నిరంతర విద్యుత్, రైతు సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన ద్వారా రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే తప్ప ఇప్పటికీ కాంగ్రెస్ ఒక్కటి కూడా కొత్తగా అందించలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందేనని, దోచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం వాటికి పట్టదని దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ నాయకులు అయోధ్య రాముడి పేరు చెప్పి ప్రజల నుంచి విరాళాలుగా సేకరించిన కోట్లాది రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చీటి వెంకట్రావు, నాయకులు కేతిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నత్తి రాజ్‌కుమార్, పొట్ట సురేందర్, టేకుల నరేశ్, జాల వినోద్‌కుమార్, సందయ్య, వనతడుపుల అంజయ్య, సుదవేణి భూమయ్య, మహిళ ప్రజా ప్రతినిదులు, తదితరులు పాల్గొన్నారు.