Narsapur Police Station | మెదక్ అర్బన్, మే21: పోలీస్ సేవల క్యూ ఆర్ కోడ్ ఆఫ్ సిటిజెన్లో ఉత్తమ జిల్లాగా మెదక్ జిల్లా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల పనితీరు, పోలీసులపై ప్రజలలో ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ జనవరి 9, 2025 తేదీన క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజెన్ రాష్ట్ర డీజీపీ జితేందర్ చేతుల మీదుగా ఆవిష్కరించారని తెలిపారు. జనవరి నుంచి ఇప్పటివరకు ప్రజలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అన్ని జిల్లాలకు ర్యాంక్‌ను కేటాయించారని పేర్కొన్నారు. అందులో జిల్లాలో మెదక్ జిల్లా మెదటి స్థానంలో ఎంపికకావడం అభినందనీయం అన్ని తెలిపారు.
ఈ సందర్బంగా డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ జితేందర్ చేతుల మీదుగా జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ సర్టిఫిట్ అందుకున్నారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో రాష్ట్రంలోనే 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లో మెదక్ జిల్లాకు చెందిన రెండు పోలీస్ స్టేషన్లు ఉండటం మెదక్ జిల్లా పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలకు నిదర్శనమని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అందులో నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు మొదటి స్థానం, తూప్రాన్ పోలీస్ స్టేషన్‌కు నాలుగో స్థానం దక్కిందని పేర్కొన్నారు. ఆయా పోలీస్స్టేషన్లకు చెందిన ఎస్హెచ్ఓలు నర్సాపూర్ ఎస్సై లింగం, తూప్రాన్ ఎస్సై శివానందం డీజీపీ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారని తెలిపారు. అలాగే ఫోక్సో కేసులలో ఐఓగా ఉండి 60 రోజులలోపే ఎక్కువగా చార్జ్షీట్లను వేసినందుకు తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి రాష్ట్రంలోనే రెండో స్థానం పొంది అడిషనల్ డీజీపీ అనిల్‌కుమార్ చేతులమీదుగా సర్టిఫికెట్‌ను అందుకున్నారని చెప్పారు.