కాజీపేట : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ట కమిటీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ నార్లగిరి రామలింగం డిమాండ్ చేశారు. కాజీపేట పట్టణం 61 వ డివిజన్ పరిధిలోని ఫాతిమా నగర్ సమీపంలోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం స్థలాన్ని పలువురు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని నడిబొడ్డులో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం కుడి చేయిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్యసం చేశారన్నారు. గతంలో కూడా సిమెంట్ గద్దెను తవ్వడం, ఐలమ్మ విగ్రహాన్ని దొంగలించారని తెలిపారు.
కొంతమంది మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మదర్ తెరిసా విగ్రహం పక్కన, ఐలమ్మ విగ్రహం ఉండకూడదనే కక్షపూరితంగా ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మేమేం చేతులు ముడుచుకొని కూర్చోలేదని ఖబర్దార్ అని హెచ్చరించారు. ఎక్కడో పుట్టి పెరిగిన మథర్ తెరిసా విగ్రహాన్ని కాపాడు కొనేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన వ్యక్తిగా వీర వనితగా గుర్తింపు ఉన్న నాయకురాలు విగ్రహం పైన దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాళ్లను పోలీసులు ఇంతవరకు గుర్తించకపోవడం చాలా బాధాకరం అన్నారు. పోలీస్ శాఖ, మున్సిపల్ అధికారులు వీలైనంత తొందరగా ఆ ద్రోహులను పట్టుకొని శిక్షించాలని, అదే స్థానంలో మరొక విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమ్మయ్య రజక సంఘం అధ్యక్షుడు గడ్డం అశోక్, సీపీఎం పార్టీ నాయకుడు, సారంగపాణి, సారంగం, సతీష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.