దామరచర్ల, నవంబర్ 13 : అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తండాల తలరాతను మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని ఎమ్మెల్యే, మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని పుట్టలగడ్డతండా, తూర్పుతండా, తిమ్మాపురం, కల్లేపల్లి, గాంధీనగర్ గ్రామాల్లో ప్రగతి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాటి సమైక్య పాలనలో చితికి పోయిన తండాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 54 తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి గిరిజనులకు రాజకీయంగా అవకాశం కల్పించారన్నారు. ఒక్కో తండాకు ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు, అభివృద్ధికి రూ.4 నుంచి రూ.5 కోట్ల నిధులు వెచ్చించామన్నారు. ప్రతితండాలో సాగు, తాగునీరు, సీసీరోడ్లు, మౌలిక వసతులు, అన్ని సదుపాయలు కల్పించామన్నారు. నాడు సాగునీరు లేక బీళ్లుగా మారిన పొలాలు.. నేడు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు సాగునీటి వనరుల కల్పనతో సస్యశ్యామలంగా మారాయన్నారు.
గతంలో వ్యవసాయానికి రాత్రిపూట కరెంట్ ఇవ్వడంతో ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలు వీధిన పడ్డా అప్పటి పాలకులు పట్టించుకోలేదని తెలిపారు. కరెంటు సరిగా రాక మోటర్లు కాలిపోయి, పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారనీ.. కానీ నేడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. మండలంలో సుమారు వెయ్యి ఎకరాల పోడుభూములకు పట్టాలు ఇచ్చినట్లు చెప్పారు. మండలంలోని మిగతా ప్రభుత్వ భూములకు కూడా పట్టాలు ఇప్పించే భాద్యత తనదే అన్నారు. మండలంలో రూ. 400 కోట్లతో మూడు ఎత్తిపోతల పథకాలు, అన్నవేరు వాగుపై ఏడు కోట్లతో రెండు చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీటితో మండలంలోని తండాలతో పాటు పలు గ్రామాల్లోని 20 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని పేర్కొన్నారు. పుట్టలగడ్డతండాలో మరో ఎత్తిపోతల పథకం, బీటీ రోడ్డు సదుపాయం కల్పిస్తామన్నారు. గిరిజన తండాలను కలుపుతూ బీటీరోడ్లు వేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయంటే సాగర్ ప్రాజెక్ట్ నుంచి, అన్నవేరు వాగు నుంచి నీటిని వదిలి పంటలను కాపాడానని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకొని మద్దతు ధర అందించినట్లు చెప్పారు. మండలంలో ఆలయాల అభివృద్ధికి కృషి చేసామన్నారు. కృష్ణా పుష్కరాలకు వాడపల్లిలో రూ. 30 కోట్లతో అభివృద్ధి పనులు చేయించినట్లు తెలిపారు. కల్లేపల్లి ఆలయ పునర్నిర్మాణానికి రూ. 40 లక్షలు విడుదల చేయించినట్లు చెప్పారు.
స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు
మండలంలో ఇప్పటికే రూ. 30వేల కోట్లతో యాదాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణం కొనసాగుతుందని.. ఇందులో ఉద్యోగాలకు స్థానిక యువతకే మొదటి ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. మండలంలోని వీర్లపాలెంలో మరో పరిశ్రమ, వాడపల్లి ఇర్కిగూడెం వద్ద స్టీల్ యుటిలటీస్ కర్మాగారం పనులు కొనసాగుతున్నాయని అవి పూర్తయితే అనేక మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. దాంతో పాటు ఈ ప్రాంతంలో కరెంటు, నీరు, రోడ్డు, రైలు మార్గాలు అనుకూలంగా ఉండటంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని, రానున్న రోజుల్లో మండలం పరిశ్రమల హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో ఏడువేల మెగావాట్ల విద్యుత్ సరఫరా ఉంటే నేడు దానిని సీఎం కేసీఆర్ 27వేల మెగావాట్ల ఉత్పత్తికి పెంచారన్నారు.
ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మొద్దు
సమైక్య రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా తట్టెడు మట్టి పోయని వారు నేడు ఎన్నికల సమయంలో వచ్చి మాయ మాటలతో ఓట్లు అడుగుతున్నారని, వారిని నమ్మొద్దని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని చెప్పా పార్టీకి ఓటువేస్తారా, 24 గంటల కరెంట్ ఇచ్చే సీఎం కేసీఆర్‌కు ఓటు వేస్తారో ప్రజలే నిర్ణయించాలని సూచించారు. అభివృద్ధి చేసేవారిని, అన్నం పెట్టేవారిని వదులుకొని ఒట్టి మాటలు చెప్పేవారిని నమ్మితే మోసపోతారన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మళ్లీ తనను ఆశీర్వదిస్తే మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
ఊరూరా ఘన స్వాగతం
మండలంలో పలు తండాల్లో ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రచారం కోసం వెళ్లగా గిరిజనులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లు, బోనాలు, కోలాటాలు, గిరిజన సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికి బొట్టుపెట్టి ఆశీర్వదించారు. మొతటగా మండలంలో పుట్టలగడ్డ తండా ఆంజనేయ స్వామి ఆలయంలో, కల్లేపల్లి బంగారు మైసమ్మ ఆలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే అనంతరం ప్రచారం ప్రారంభించారు. మళ్లీ అధికారంలోకి వస్తే చేసే పనుల గురించి ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో డీసీఎంస్ చైర్మన్ డి. నారాయణరెడ్డి, జడ్పీటీసీ ఆంగోతు లలితా హతీరాం, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ, ఏఎమ్‌సీ వైస్ చైర్మన్ కె. వీరకోటిరెడ్డి, సర్పంచులు రూపావత్ జ్యోతి, శాంతి, శారద, సైదమ్మ, ఎంపీటీసీలు మంగ, అనంతలక్ష్మి, నాయకులు లక్ష్మా, రమేశ్, బాలశంకర్, తులస్యా, పాచ్యూనాయక్, శ్రీనివాస్‌రెడ్డి, బాలసత్యనారాయణ, నాగిరెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.