రామగిరి, ఏప్రిల్ 21 : దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పర్యాయం 80,030 ఉద్యోగాల ప్రకటన తెలంగాణ సర్కారుకే సాధ్యమైందని, నూతన జిల్లాలకు అనుగుణంగా ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కంచర్ల మానస ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను మంత్రి గురువారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు.
అంతకు ముందు పార్టీ కార్యాలయ నూతన భవనానికి పూజలు చేసి ప్రవేశం చేశారు. సరస్వతీ అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిప్రజల్వన చేసి మాట్లాడారు. గత పాలకులు హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటించి ఉద్యోగాలన్నీ ఆంధ్రా వారితో నింపారని తెలిపారు. ఆయా సమస్యలను అధిగమిస్తూ స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులను తీసుకురావడంలో సీఎం కేసీఆర్ పట్టుదల అమోఘమని కొనియాడారు. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కడంతోపాటు మల్టీ జోన్ వ్యవస్థ తీసుకురావడం నిరుద్యోగులకు వరమని పేర్కొన్నారు.
ఉచిత శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపందుకుని కంచర్ల మానస ఫౌండేషన్ సహకారంతో ఉచిత శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. భవిత ఇనిస్టిట్యూట్ వారితో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఏడు వేల మంది నుంచి 2వేల మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. తర్వలోనే మరో వెయ్యి మందికి శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కోచింగ్ నిర్వహణలో శిక్షణ సంస్థ డైరెక్టర్ టి.వెంకట్‌రెడ్డి, తాసీల్దార్ మందడి నాగార్జున్‌రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నల్లగొండ నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ గోలి అమరేందర్‌రెడ్డి, న్యాయవాది జీ.వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవేందర్, నాయకులు సుంకరి మల్లేశ్‌గౌడ్, కటికం సత్తయ్యగౌడ్, నాయకులు బక్క పిచ్చయ్య, వట్టిపల్లి శ్రీను, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉద్యోగాల సమయం అసన్నమైందని, కఠిన దీక్ష, కఠోర శ్రమతో చదివి వాటిని సాధించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ ఆడిటోరియంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రెమా రాజేశ్వరితో కలిసి ప్రారంభించారు.
ఎంతో కష్టపడి ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు అదే స్ఫూర్తిని కొనసాగించి ఉద్యోగం సాధించాలని సూచించారు. నీళ్లు, నిధులు, నియమాకాల కోసం ఏర్పడిన రాష్ట్రంలో నీళ్లు, నిధులు సాధించుకున్నామని ఇక ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు వస్తున్నారని అన్నారు. అందులో భాగంగా 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలిపారు.
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఉచిత శిక్షణ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ జిల్లా నుంచి 250 మందిని ఎంపిక చేశామని, సంక్షేమ శాఖల ద్వారా మరికొందరిని ఎంపిక చేసి మొత్తం 900 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.