బడంగ్‌పేట, మార్చి 9: బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సరస్వతి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నాదర్గుల్కు చెందిన సాయిబాబా ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎంక్వయిరీ అధికారిని నియమించారు. జరిగిన సంఘటనపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి.. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాదర్గుల్ ప్రధాన కూడలిలో ఉన్న 1805 గజాల స్థల వివాదం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్థలానికి సంబంధించిన వివరాలను సేకరించినట్టు తెలిసింది. గత కొన్ని సంవత్సరాల నుంచి భూ వివాదం ఉన్నట్లు ఎంక్వయిరీ అధికారి నిర్ధారణకు వచ్చారు. ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన భూ వివాదం విషయంలో కమిషనర్ జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదట అక్రమ నిర్మాణాలంటూ మున్సిపల్ అధికారులు 1805 గజాల స్థలంలో నిర్మాణం చేసిన షెడ్లను తొలగించారు. కూల్చివేసిన తర్వాత అదే స్థలంలో మరోసారి నిర్మాణాలు చేపడుతున్న విషయాన్ని సాయిబాబా అనే వ్యక్తి కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. కమిషనర్ నెలల తరబడి ఆ విషయాన్ని నాంచుతూ వస్తున్నారని సాయిబాబా ఆరోపించారు. అక్రమ నిర్మాణదారులకు మద్దతు పలుకుతూ వారి నుంచి లంచం తీసుకున్నట్లు సాయిబాబా ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తన భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే కమిషనర్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు సాయిబాబా తెలిపారు. ఎంక్వైరీ ఆఫీసర్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి వివాదాస్పదంగా మారిన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిసింది. అధికారులు న్యాయం చేస్తారో లేదోనని సాయిబాబా కమిషనర్ పై కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ కూడా వేసినట్లు సాయిబాబా తెలిపారు. అధికారులు న్యాయం చేయకపోతే లోకాయుక్తను ఆశ్రయిస్తానని తెలిపారు.