రాజకీయ నాయకుడైనా.. గతంలో ఎంపీపీగా, ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్నా.. తాను రైతునని చెప్పుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతారు తిప్పర్తి జడ్పీటీసీ, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పాశం రాంరెడ్డి. తనను కలిసిన రైతులతో కలగోలుపుగా ఉంటూసాగు వివరాలు ఆరా తీస్తుంటారు. ఒక రైతుగా తోటి రైతుల అభివృద్ధి కోసమే రాజకీయాల్లో ఉన్నానని.. తన గమనం, గమ్యం అన్నదాతల సంక్షేమానికే అని చెబుతుంటారు. పదిహేడేండ్ల రాజకీయ ప్రస్థానం… అందుకు సమాంతరంగా వ్యవసాయం, వ్యాపారం ఇలా ఆయన మొదలుపెట్టిన ఏ పనిలోనూ వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతున్న ఆదర్శ రైతు, రైతు నేత పాశం రాంరెడ్డి. తన వ్యక్తిగత, రాజకీయ అంశాలపై చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. రైతు బిడ్డగా పంటలు సాగు చేయడం నాకిష్టం. రైతుగా తోటి రైతులకు సాయం చేయడం లక్ష్యం. అందుకే వ్యవసాయం చేస్తూనే… రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా రైతుల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్నానని తిప్పర్తి జడ్పీటీసీ సభ్యుడు పాశం రాంరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ నుంచి నల్లగొండ జడ్పీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న ఆయన తనను ప్రోత్సహిస్తున్న పెద్దలు, అభివృద్ధికి సహకరిస్తున్న నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను నమస్తే తెలంగాణతో పంచుకున్నారు.
మా తాత పేరు కూడా పాశం రాంరెడ్డి. తిప్పర్తి పంచాయతీకి ఆయన మొట్ట మొదటి సర్పంచ్, లాయర్ కూడా. నేను వరి, బత్తాయి పంటలు ఎక్కువగా సాగు చేస్తాను. వ్యాపార రీత్యా హైదరాబాద్ వెళ్లివస్తున్నా… ఎక్కువ సమయం మా ఊరు మర్రిగూడెంలోనే గడుపడం ఇష్టం. నా పొలం, మా మండలం, మా జనం అంటే నాకు చాలా ప్రేమ. అమ్మానాన్నలు విద్యాసాగర్‌రెడ్డి-సుమతి. నా భార్య శ్వేత. నా బిడ్డలు త్రిష, సుష్మిత(అక్క బిడ్డ). 40 ఏండ్లుగా నిత్యం నా బాగోగులు కాంక్షించే నా మిత్రుడు శ్రీనివాస్ వీరవెళ్లి.. ఇలా ఎందరో ఆప్తుల సహకారంతోనే విజయవంతంగా ముందుకు సాగుతున్నా. రైతుబిడ్డగా నిరంతరం రైతుల మధ్య, లీడర్‌గా ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండాలన్నదే నా తపన.
టీఆర్ఎస్ పార్టీ నుంచి తిప్పర్తి జడ్పీటీసీగా ఎన్నికై అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాను. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సహకారంతో నిధులు తీసుకొచ్చి సంతృప్తిగా అభివృద్ధి చేపడుతున్నాను. జిల్లాపరిషత్‌లో ఫ్లోర్‌లీడర్ కావడంతో జిల్లా అధికారుల సహకారంతో సమస్యల పరిష్కారం సులభం అవుతున్నది. ఈ విషయంలో నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి ప్రోత్సాహం చాలా ఉంది. కరోనాతో రెండు సంవత్సరాల పాటు నెలకొన్న సంకట పరిస్థితితో అభివృద్ధి కొంత మందగించింది. అయినా ఆ కష్టకాలంలో ఎన్నడూ మండలాన్ని వీడలేదు. కరోనా రోజుల్లోనూ సీఎం కేసీఆర్ ఇచ్చిన భరోసాతో రెండు సీజన్లలోనూ తిప్పర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయించి ధాన్యం కొనుగోళ్లను నిత్యం పర్యవేక్షించాను. రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులతో మాట్లాడుతూ గన్నీ బ్యాగుల విషయంలోనూ కొరత రాకుండా రైతులకు ఇబ్బందులు కలుగకుండా చేశాను. నా కృషిని గుర్తించి జడ్పీ సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రశంసించారు. సకాలంలో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యే విధంగా చర్యలు చేపట్టడం సంతృప్తిని మిగిల్చింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో నా వంతుగా సేవలు అందించాను. ఈ విషయంలో గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి సహకారంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, మెడికల్ కిట్లు, పోషకాహారం పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం. జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో చేపట్టిన కార్యక్రమాల్లో నేను భాగస్వామిని కావడం ఆనందంగా ఉంది.
గుత్తా సుఖేందర్‌రెడ్డి శిష్యరికం
1999లో ఎలిమినేటి మాధవరెడ్డి ద్వారా నా గురువు, తండ్రి సమానులైన గుత్తా సుఖేందర్‌రెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి 20 ఏండ్లకు పైగా నా మీద ఆయకున్న నమ్మకం, అందుకున్న ప్రోత్సాహం ఎన్నటికీ మరువలేనిది. ఆయన నుంచి నేను నేర్చుకున్న క్రమశిక్షణ ఇంకా విలువైంది. కచ్చితమైన సమయ పాలన పాటించే విషయంలో సుఖేందర్‌రెడ్డి నాకు ఆదర్శం. వ్యక్తిత్వ అభివృద్ధిలో నాకు మార్గదర్శి. అమెరికాలో స్థిరపడ్డ నా మిత్రుడు వీరవెళ్లి శ్రీనివాస్ నుంచి కూడా చాలా విషయాలతో పాటు క్రమశిక్షణ కూడా నేర్చుకున్నా.
ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలన్నది నా కల. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే ‘మన ఊరు-మన బడి’ పేరుతో ఆ పనికి శ్రీకారం చుట్టింది. జడ్పీటీసీగా నాకు వచ్చే రూ.13 వేల వేతనానికి మరో రూ.2వేలు కలిపి నెలకు 15 వేల రూపాయలను మండలంలోని 7 స్కూళ్లలో పారిశుధ్య నిర్వహణకు ఇస్తున్నాను. ఉమ్మడి జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఏటా టీచర్స్ డే సందర్భంగా మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు నా సొంత ఖర్చుతో ఆటల పోటీలు నిర్వహిస్తున్నాను. టీచర్లు సైతం బాధ్యతగా విద్యను బోధిస్తున్నారు. వారికి
ధన్యవాదాలు.
రైతుగా, రైతుల కోసం పని చేస్తున్న సంతృప్తి నాకు చాలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి క్షణం రైతుల గురించే ఆలోచిస్తున్నది. రైతు బీమా, రైతుబంధు, ధాన్యం కొనుగోళ్లు, రైతు వేదికల నిర్మాణం, నిరంతర విద్యుత్ సరఫరా, నీటి పారుదల సహా అద్భుతమైన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. రైతుగా నేను తిప్పర్తి మండలంలో అవన్నీ పక్కాగా అమలయ్యేలా చూస్తున్నాను. ఈ విషయంలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, అధికారుల సహకారం కూడా చాలా ఉంది.
నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సహకారంతో తిప్పర్తి జడ్పీటీసీగా నేను గత ఎన్నికల సమయంలో చిన్నాయిగూడెం నుంచి గంగన్నపాలెం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం 5 గ్రామ
పంచాయతీల మీదుగా 8.6 కిలోమీటర్ల దూరం రోడ్డు కోసం పీఎంజీఎస్‌వై నుంచి రూ. 9కోట్లు మంజూరు చేయించాను. పనులు కూడా మొదలయ్యాయి. చిన్నాయిగూడెం నుంచి కాశీవారిగూడెం, జొన్నగడ్డలగూడెం, ఎర్రగంట్లగూడెం మీదుగా గంగన్నపాలెం వరకు రోడ్డు నిర్మాణం సాగుతున్నది. ఈ రోడ్డుతో మాడ్గులపల్లి, తిప్పర్తి మండలాల్లోని మొత్తం 10 గ్రామాల ప్రజలు నల్లగొండకు వచ్చేందుకు దూరభారం తగ్గుతుంది.
ప్రగతి పథం