Gautam Gambhir : భారత టెస్టు జట్టు (India’s Test Cricket Team) కష్టాల్లో ఉందన్న వాదనను హెడ్ కోచ్ (Head Coach) గౌతమ్ గంభీర్ (Gautham Gambhir) తోసిపుచ్చారు. ఇటీవల ఎదురైన పరాజయాలను పతనంగా చూడవద్దని అన్నారు. జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉందని స్పష్టంచేశారు. తనకు ర్యాంకింగ్స్, సోషల్ మీడియా (Social Media) లో లైక్స్ (Likes), వ్యూస్ (Views) హడావుడి కంటే ట్రోఫీలు గెలువడమే ముఖ్యమని చెప్పారు.
శ్రీలంకతో రెండో టెస్టుకు భారత్ సిద్ధమవుతోందని, గాలేలో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించిందని గంభీర్ గుర్తుచేశారు. రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉందని, కొలంబో టెస్టుతో సిరీస్ విజేత ఎవరో తేలనుందని చెప్పారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత భారత జట్టు భారీ మార్పులకు లోనైందని అన్నారు.
న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో స్వదేశీ సిరీస్‌ల్లో ఓటములు ఎదురయ్యాయని, ఆస్ట్రేలియా పర్యటనలోనూ భారత్‌కు నిరాశే ఎదురైందని, అయినా జట్టు గాడి తప్పిందని అనుకోవద్దని గంభీర్ చెప్పారు. తాము టెస్టు క్రికెట్లో ఇబ్బంది పడటం లేదని, ఇంగ్లండ్ పర్యటన తర్వాత సహేతుకమైన క్రికెట్ ఆడుతున్నామని అన్నారు. తనకు ట్రోఫీలు గెలువడమే ముఖ్యమని, తాను పట్టించుకునేది అదేనని గంభీర్ స్పష్టంచేశారు.
అదేవిధంగా కొత్త తరం ఆటగాళ్లపై గంభీర్ నమ్మకం వ్యక్తంచేశారు. కొలంబోలో 20 వికెట్లు తీసే అత్యుత్తమ బౌలింగ్ కూర్పుతో బరిలోకి దిగుతామని చెప్పారు. కుల్దీప్ యాదవ్ మంచి బౌలర్ అని పేర్కొన్నారు. ఒకటి రెండు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను పక్కన పెట్టకూడదన్నారు. క్రికెట్లో ఎత్తుపల్లాలు సహజమని, ఆటగాళ్లకు మరింత సమయం ఇవ్వాలని సూచించారు. గిల్, పడిక్కల్, సుతార్లపై గంభీర్ విశ్వాసం ప్రకటించారు.
ఇక మూడు టెస్టుల సిరీస్‌లకు గంభీర్ మద్దతు తెలిపారు. తొలి టెస్టులో ఓడిన జట్టుకు పుంజుకునే అవకాశం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. శ్రీలంకతో ప్రస్తుత సిరీస్ రెండు టెస్టులకే పరిమితం కావడంతో రెండో మ్యాచ్ ఫలితమే సిరీస్‌ను నిర్ణయించనుందని అన్నారు.