Actress Sneha | మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’ (Kaaka)పై టాలీవుడ్లో రోజురోజుకూ అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ క్రేజీ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అప్పట్లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీనియర్ నటి స్నేహ.. ఇప్పుడు మెగాస్టార్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ‘కాకా’ చిత్రంలో స్నేహ చిరంజీవి భార్య పాత్రలో కనిపించనున్నారట. ఈ వార్త నిజమైతే కచ్చితంగా ఇది అభిమానులకు పండగలాంటి వార్తే అవుతుంది. కొన్నేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో స్నేహ మాట్లాడుతూ.. తన కెరీర్లో మెగాస్టార్ చిరంజీవితో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని, అది తన చిరకాల కోరిక అని మనసులోని మాటను బయటపెట్టారు. ఆనాడు ఆమె పంచుకున్న కల ఇప్పుడు నెరవేరబోతుండటం విశేషం. వివాహం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి, సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా సెలెక్టివ్‌గా మంచి ప్రాజెక్ట్స్ మాత్రమే ఎంచుకుంటున్న స్నేహకు.. ఈ సినిమా ద్వారా తెలుగు తెరపై మరోసారి భారీ రీఎంట్రీ లభించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఆక్వా పరిశ్రమలో ఒక సాధారణ సూపర్వైజర్గా ‘కె. సత్యం’ అనే విలక్షణ పాత్రలో మెగాస్టార్ కనిపించనున్నారు. పైకి చాలా కూల్‌గా, సాధారణంగా కనిపించే ఈ పాత్ర వెనుక ఒక బలమైన ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ ఉన్నట్లు గ్లింప్స్ చూస్తే స్పష్టమవుతోంది. మరోవైపు, మలయాళ యువ నటి అనస్వరా రాజన్ ఈ చిత్రంలో అత్యంత కీలకమైన ‘అమ్ములు పాప’ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కథా గమనాన్ని మలుపు తిప్పే ఈ పాత్ర చిత్రానికే గుండెకాయ లాంటిదని ఇప్పటికే మేకర్స్ ప్రకటించడం విశేషం.
ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ భారీ మాస్ ఎంటర్టైనర్ను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే నటి స్నేహ ఎంట్రీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.