గాంధీనగర్: కొందరు వ్యక్తులు కేవలం 12వ తరగతి మాత్రమే చదివారు. అయినప్పటికీ డాక్టర్లుగా చెలామణి అవుతూ వైద్యం చేస్తున్నారు. కొన్ని క్లినిక్‌లపై ఆరోపణలు రావడంతో ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు కలిసి సంయుక్తంగా రైడ్ చేశారు. వైద్య డిగ్రీలు లేకుండా వైద్యులుగా నటిస్తూ చికిత్సలు అందిస్తున్న 8 మందిని అరెస్ట్ చేశారు. (practising as doctors) గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. పాండేసరా ప్రాంతంలోని పలు క్లినిక్స్‌కు చెందిన వ్యక్తులు సరైన వైద్య అర్హతలు లేకుండా వైద్యులుగా చెలామణి అవుతూ రోగులకు చికిత్స అందిస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు అందాయి.
కాగా, సూరత్ నగర పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ), జిల్లా ఆరోగ్య శాఖ సంయుక్తంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. పాండేసరా ప్రాంతంలోని ఎనిమిది వేర్వేరు క్లినిక్‌లపై ఈ బృందాలు రైడ్ చేశాయి. అవసరమైన వైద్య అర్హతలు లేకపోయినా కొందరు వ్యక్తులు వాటిని నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తెలుసుకున్నారు. ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.
మరోవైపు నిందితుల్లో కొందరు కేవలం 12వ తరగతి వరకు మాత్రమే చదవగా, మరికొందరు బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారని పోలీస్ అధికారి తెలిపారు. కొందరు గతంలో కాంపౌండర్లుగా, ఆపరేషన్ థియేటర్ సహాయకులుగా పనిచేసినట్లు చెప్పారు. వైద్య రంగంలో తమకున్న ఈ అనుభవాన్ని ఉపయోగించి డాక్టర్లుగా నమ్మించి రోగులకు చికిత్స అందిస్తున్నారని ఆరోపించారు.
అలాగే రైడ్స్ సందర్భంగా సుమారు లక్ష విలువైన మందులు, ఇంజెక్షన్లు, సిరప్లు, ఇతర వైద్య సామాగ్రిని ఆ క్లినిక్స్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి వివరించారు. ఆరోగ్య శాఖ అధికారుల ఫిర్యాదుతో నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.