మొయినాబాద్, జనవరి 01: అక్రమ నిర్మాణాలంటూ మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతల పర్వం వివాదాస్పదంగా మారింది. కోర్టు స్టే ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నిర్మాణాలు తమ ఇళ్లను కూల్చేశారని బాధితులు వాపోయారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు దౌర్జన్యంగా తమ ఇండ్లను కూల్చివేశారని గిరిజనులు కంటనీరు పెట్టుకున్నారు. పెద్దలను వదిలిపెట్టి.. పేదల ఇండ్లను మాత్రమే కూల్చేసే మున్సిపల్ అధికారులకు ఈసారి తమ ఇళ్లే కనిపించాయని గిరిజనులు మండిపడుతున్నారు. కాయ కష్టం చేసి కొనుగోలు చేసిన ప్లాట్ల మీదికి వచ్చి తమ ఇండ్లను కూల్చివేసారని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం రెవిన్యూ పరిధిలోని రాఘవేంద్ర సొసైటీ 210, 211,212 సర్వే నెంబర్లలోని 16 ఎకరాల భూమిని 1986 కొనుగోలు చేసి వెంచర్ చేశారు. అప్పటినుంచి రాఘవేంద్ర సొసైటీ ప్లాట్లు అమ్ముతోంది. సొసైటీ సభ్యులైన హరికిరణ్, హర్షవర్ధన్ రావులు ప్లాట్లు విక్రయిస్తూ వచ్చారు. గత మూడు, నాలుగు ఏళ్ల నుంచి కొందరు గిరిజన కుటుంబాలు అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసి తమ స్థాయికి తగ్గట్టుగా ఇండ్ల నిర్మాణం చేపట్టుకొని నివాసం ఉంటున్నారు. వెంచర్ చేసిన తర్వాత రాఘవేంద్ర సొసైటీ అధ్యక్షుడు ఎంపీరంగారెడ్డి 1998లో శ్రీనివాసరాజు, సురేష్ రెడ్డిలకు 16 ఎకరాల భూమిని అగ్రిమెంట్ చేశారు. అగ్రిమెంట్ చేసిన తర్వాత కూడా రాఘవేంద్ర సొసైటీ వాళ్లు కొన్నేళ్ల వరకూ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో శ్రీనివాసరాజు, సురేష్ రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించి 2011లో డిక్రి తెచ్చుకొని.. కోర్టు ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అయితే.. ఇక్కడ ముందు ప్లాట్లు కొనుగోలు చేసిన వారు జీవో 111 కు విరుద్ధంగా నిర్మాణాలను చేపట్టారని కోర్టును ఆశ్రయించారు. ఐదు నెలల క్రితం నిర్మాణాలను కూల్చివేయాలని తమకు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని మొయినాబాద్ మున్సిపల్ శాఖను సదరు వ్యక్తులు ఆశ్రయించారు. మున్సిపల్ శాఖ అధికారులు హెచ్ఎండిఏ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో పాటు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గిరిజనుల ఇల్లు కూల్చివేశారు. కాళ్ళ వేళ్ళ పడినా వదలకుండా ఇంట్లో నుంచి అందర్నీ గెంటివేసి ఇంట్లోని సామగ్రిని రోడ్డుపైన పడేసి ఇండ్లను కూల్చివేశారు.
రాఘవేంద్ర సొసైటీలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇండ్లు నిర్మాణం చేపట్టగా గత ఏడాది క్రితం కొందరు వ్యక్తులు వెంచర్ చేసిన భూమి తమదని గొడవకు దిగారని బాధితులు తెలిపారు. వెంచర్లో ఇల్లు కట్టుకున్న ఓ వ్యక్తి అప్రమత్తమై హైకోర్టును ఆశ్రయించి 2025 డిసెంబర్ 23న మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. ఆ ఇంటిపై 2026 జనవరి 20వ తేదీ వరకు స్టే ఉత్తర్వులు ఉన్నాయి. అయితే.. అతడి ఇంటిని సైతం అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు.
అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చివేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ ఖాజా మోహినీద్దు న్, టౌన్ ప్లానింగ్ అధికారి వాణి పోలీసు అధికారులు చెబుతున్నారు. కానీ కూల్చివేతలకు సంబంధించి ఉన్న హైకోర్టు ఉత్తర్వులు చూపించాలని మీడియా ప్రతినిధులు కోరగా మున్సిపల్ కమిషనర్‌ను, టౌన్ ప్లానింగ్ అధికారిని ఉత్తర్వులను మాత్రం చూపించడం లేదు. తమ ఇండ్లను అకారణంగా కూల్చివేశారని ప్లాట్ల బాధితులు బుధవారం హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.
దాదాపు10 కుటుంబాలు తమ స్తోమత తగ్గట్టుగా ఇండ్ల నిర్మాణం చేపట్టగా.. మరికొందరు తమ ప్లాట్లకు ఫ్రీ-కాస్ట్ వేసుకున్నారు. ఇక్కడే కొందరు పెద్దలు కూడా తమ ప్లాట్లకు ఫ్రీ-కాస్ట్ వేసి చిన్న గదులను నిర్మించుకున్నారు. కానీ, మున్సిపల్ అధికారులు మాత్రం పెద్దల ప్లాట్ల జోలికి వెళ్లకుండా కేవలం గిరిజనుల ఇండ్లనే ధ్వంసం చేశారు.
హెచ్ఎండిఏ ఎన్ఫోర్స్మెంట్, మున్సిపల్ శాఖ, టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసు బలగాలతో వచ్చి రాఘవేంద్ర సొసైటీలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇండ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను కూడా పగలగొట్టారు. కూల్చివేతలకు వందమంది పోలీసులతోపాటు 100 మంది బౌన్సర్లు కూడా వచ్చారని బాధితులు పేర్కొన్నారు. అందరూ నిద్రపోతుండగా జేసీబీలతో వచ్చి.. ఇంట్లోనుంచి బలవంతంగా బయటకు పంపించి ఇండ్లను కూల్చివేశారు. బాధితుల ఫోన్లు,మోటార్ సైకిల్ కీలు కూడా తీసుకున్నారు. ఎందుకు కూల్చేస్తున్నారు? అనిఎవరన్నా ప్రశ్నిస్తే పోలీసులు, బౌన్సర్లు చుట్టుముట్టి వారి నోరు మూయించి, పక్కకు తీసుకెళ్లారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూమి వాళ్ళది అయితే తెల్లవారుజామున వచ్చి కరెంటు కట్ చేసి.. సీసీ కెమెరాలు పగలగొట్టి దొంగతనంగా కూల్చివేయడం ఎందుకు? అని గిరిజన కుటుంబాలు ప్రశిస్తున్నాయి.