మొయినాబాద్ : భక్తుల కొంగు బంగారం చిలుకూరు బాలాజీ ( Chilkur Balaji ) ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఉదయం నాలుగు గంటల నుంచి స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. సుమారుగా 50 వేల నుంచి 85 వేల మంది భక్తులు వచ్చి ఉంటారని ఆలయ అర్చకులు రంగరాజన్ తెలిపారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్ సర్వీసులను నడిపారు. భక్తుల కోసం ప్రత్యేకంగా 22 ఎకరాల్లో పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మొయినాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి సహకరించిన పోలీస్ శాఖ అధికారులకు, ఆలయ సిబ్బందికి అర్చకులు రంగరాజన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.