కార్పొరేషన్, ఫిబ్రవరి 11: కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ నగరపాలక సంస్థ, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో స్వల్ప ఉద్రిక్తతల మధ్య పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం పూట మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పుంజుకున్నది. ఉదయం మొదటి రెండు గంటల్లో అన్ని మున్సిపాలిటీల్లో 11 శాతం మేరకు మాత్రమే పోలింగ్ సాగగా.. 11 గంటల వరకు 24 నుంచి 30 శాతం వరకు పోలింగ్ నమోదైంది. చివరి ఆరు గంటల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రావడం గమనార్హం.
నగరంలో పోలింగ్ కేంద్రాల ప్రాంతాల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలీసులు పూర్తిగా రోడ్లను మూసి వేసి డైవర్షన్లు చేయడంతో ప్రజలు రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధుల విషయంలో పోలీసు సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంపై ఓటర్లు తీవ్ర ఆగ్రహాలను వ్యక్తం చేశారు. 750 నుంచి వెయ్యి ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడంతో భారీ క్యూ లైన్లు ఎక్కడా కనిపించలేదు.
కరీంనగర్ నగరంలోని పలు డివిజన్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య అనేక డివిజన్లలో తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో బూత్‌ల వద్ద ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలతో నెలకొన్నది.
49వ డివిజన్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థి సెల్‌ఫోన్‌ను బీజేపీ నాయకులు పగులగొట్టారని ఇరువర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. దీంతో పోలింగ్ స్టేషన్ వద్ద కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొన్నది.
10వ డివిజన్లో పోలింగ్ స్టేషన్ వద్ద బీజేపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా పోలీసులు పట్టుకొని ఇద్దరిని అరెస్టు చేశారు.
రేకుర్తి 19వ డివిజన్లోని ప్యారడైజ్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు కేంద్రానికి వచ్చే దారికి ఇరువైపులా రెండు పైపులను దారికి అడ్డుగా వేయడంతో ఓటర్లు, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. మున్సిపల్ సిబ్బంది పైప్‌లైన్ వరకు వీల్ చైర్లో కేంద్రంలోకి తీసుకువెళ్లి తిరిగి అక్కడే వదిలిపెట్టడంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఓటర్లు వారి వాహనాల వద్దకు వెళ్లేందుకు తీవ్ర అవస్థ పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు వ్యవహరించిన తీరుపై ఓటర్లు మండిపడ్డారు.
సీతారాంపూర్‌లోని 23వ డివిజన్ హనుమాన్ ఆలయం నుంచి వచ్చే దారితో పాటు పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక దారిని సైడ్ వాల్స్‌తో పోలీసులు మూసివేయడంతో ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయం పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చి వెళ్లేందుకు ఓటర్లు ఇబ్బంది పడ్డారు.
పలు పోలింగ్ కేంద్రాల్లో కేవలం ఒకే ఒక వీల్‌చైర్‌ను ఏర్పాటు చేయడంతో వృద్ధులను తరలించేందుకు ఎన్నికల సిబ్బంది అగచాట్లు పడ్డారు. ఎన్నికల పరిశీలకులు సైతం వీల్చైర్లు లేకపోవడంతో సంబంధిత సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
8వ డివిజన్ అల్గునూర్‌లో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పోలింగ్ సరళిని పరిశీలించి, పోలింగ్ స్టేషన్లోకి వెళ్లారు. స్థానిక బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డు చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెనుతిరిగి, స్థానిక అంబేద్కర్ కాలనీలో పర్యటించారు. అనంతరం పోలింగ్ స్టేషన్ సమీపంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి గంట పాటు వేచి ఉండి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అభ్యంతరం తెలపడంతో అక్కడి నుంచి వెళ్లి పోయారు.
34వ డివిజన్లో పోలింగ్ బూత్‌లో వేరేవారికి బదులుగా ఓటు వేసేందుకు వచ్చిన ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి జిరాక్స్ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
చొప్పదండి ఫిబ్రవరి 11: చొప్పదండి పురపాలక సంఘంలోని 14 వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సరళిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ విలేకరులతో మాట్లాడుతూ, కరీంనగర్ కార్పొరేషన్, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగిందని పేరొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐలు నరేశ్ రెడ్డి, వంశీకృష్ణ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
హుజూరాబాద్ రూరల్/ జమ్మికుంట, ఫిబ్రవరి 11: హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు
కార్పొరేషన్/కలెక్టరేట్/హుజూరాబాద్, ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలువురు రాజకీయ నేతలు, అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్థానిక ట్రినిటీ జూనియర్ కళాశాలలోని పోలింగ్ బూత్‌లో కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మాజీ ఎంపీ వినోద్‌కుమార్ జ్యోతినగర్‌లోని ధన్గర్‌వాడీ ప్రాథమిక స్కూల్లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ 50వ డివిజన్లోని జ్యోతినగర్‌లో ఉన్న ఎస్ఆర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. నగరంలోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో కలెక్టర్ పమేలా సత్పతి ఓటు వేశారు. నగర కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ కుటుంబ సమేతంగా 59వ డివిజన్ ముకరంపురలోని కేకే హైస్కూల్లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుజూరాబాద్ పట్టణంలోని డిగ్రీ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేశారు.