పారిస్: ఐదుగురు కాదు.. 10 మంది కాదు.. ఏకంగా 89 మంది మైనర్లపై ఒక టీచర్ అత్యాచారం చేయడమే కాక తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫ్రాన్స్‌కు చెందిన 89 ఏండ్ల వృద్ధుడు 1960 నుంచి 2022 వరకు ఫ్రాన్స్ సహా వివిధ దేశాల్లో ఈ దారుణాలకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఫ్రాన్స్‌లోని గ్రెనోబుల్ నగర ప్రాసిక్యూటర్ ఎటియాన్నే మాంటియాక్స్ మంగళవారం ఈ విషయాన్ని బహిరంగ పరుస్తూ ఈ టీచర్ బాధితులెవరన్నా ఉంటే ముందుకు రావాలని కోరారు.
నిందితుడు జాక్వెస్ లెవిగ్యుల్ 1967 నుంచి 2022 వరకు భారత్, జర్మనీ, స్విట్జర్లాండ్, మొరాకో, నైజర్, అల్జీరియా, ఫిలిప్పీన్స్, కొలంబియా, ఫ్రాన్స్‌లలో ఈ దారుణాలకు పాల్పడ్డాడు. ఫ్రెంచ్ లాంగ్వేజ్ టీచర్, కేవ్ స్టడీ ట్రైనర్‌గా చేసిన జాక్వెస్ పలుచోట్లకు ప్రయాణిస్తూ బాలికలపై లైంగిక దాడులు జరిపేవాడు. బాధితులంతా 13-17 ఏండ్ల లోపు వారే. నిందితుడు అనారోగ్యంతో ఉన్న తల్లిని, వృద్ధ అత్తను కూడా హత్య చేసినట్టు నేరం అంగీకరించాడని ప్రాసిక్యూటర్ చెప్పారు. వృద్ధుడి పెన్‌డ్రైవ్‌లో ఉన్న వివరాల ద్వారా అతడు దారుణాలకు పాల్పడినట్టు గుర్తించి ఆయన మేనల్లుడు ఫిర్యాదు చేశాడన్నారు.