నిజామాబాద్, జనవరి 4, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా ముసాయిదా ప్రచురించడంతో ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక పోరు ముగిసిన దరిమిలా పట్టణ, నగరాల్లోనూ లోకల్ పోరు షురూ కానుంది. కొద్ది రోజుల్లోనే ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు కానుందనే సమాచారం పాకిపోతుండడంతో ఆశావహుల్లో కొంగొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో పోటీ చేసి ఓటమి చెందిన వారు, వివిధ కారణాలతో గత పాలకవర్గం సమయంలో పోటీ చేయలేని వారంతా ఈసారి బరిలో నిలిచేందుకు సిద్దం అవుతున్నారు. తాజా మాజీలు కౌన్సిలర్లు/కార్పొరేటర్లు సైతం మున్సిపల్ పోరులో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తహతహలాడుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటుగా భీంగల్, బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలు కొనసాగుతున్నాయి. బిచ్కుంద మున్సిపాలిటీకి తొలిసారి పాలకవర్గం ఏర్పాటు కాబోతోంది. ఓటరు తుది జాబితా ప్రకటన ఈనెల 10వ తేదీన జరుగనుంది. అనంతరం వార్డులు, డివిజన్లకు రిజర్వేషన్లు నిర్ధారిస్తారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్, నగరపాలక సంస్థ మేయర్ స్థానానికి రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికలను నిర్వహిస్తారు. ఈ హడావుడిలో ఒక్క ఛాన్స్ ప్లీజ్… అంటూ ఆశావహులు తమ ప్రయత్నాలకు పదును పెట్టి రంగంలోకి దిగారు.
మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఏ వార్డు/డివిజన్ ఏ వర్గానికి దక్కుతుందో? అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్ చేసిన అనంతరం ఓపెన్ కేటగిరి స్థానాలకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. చాలా మంది గత రిజర్వేషన్లను అంచనా వేసుకుని వార్డులు, డివిజన్లలో ప్రజలతో మమేకం అవుతున్నారు. తమకు అనుకూలంగా రిజర్వేషన్ వస్తుందనే ఆశతో క్షేత్ర స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎగనామం పెట్టిన నేపథ్యంలో 50శాతంలోపే రిజర్వేషన్లు అమలు కానున్నాయి. సర్పంచ్ స్థానాలకు వర్తించిన నియమ, నిబంధనలనే మున్సిపాలిటీలకు అమలు చేయబోతున్నారు.
అన్ని రాజకీయ పార్టీల్లో ఆశావహ అభ్యర్థులంతా ఇప్పటికే హడావుడి మొదలు పెట్టారు. ఆకస్మాత్తుగా షెడ్యూల్ వెలువడితే ప్రజల్లోకి వెళ్లడం కష్టం అవుతుందనే కారణంతో మంచి చెడు విషయాలను కనుక్కుంటూ జనాలతో మమేకం అవుతున్నారు. 50శాతం మహిళా రిజర్వేషన్లు వర్తింపజేస్తుండటంతో దంపతుల్లో ఎవరో ఒకరు పోటీ చేయడం ఖాయమనే సంకేతాలను అందిస్తున్నారు. రిజర్వేషన్లు తేటతెల్లమైతే తదుపరి మరింత వేగంగా జనాల్లో చొచ్చుకెళ్లొచ్చనే ఆలోచనతో మరికొంత మంది తటస్థంగా ఉండి పోయారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు అనేక చోట్ల సత్తా చాటారు. కేవలం బీఆర్ఎస్ చేసిన పదేళ్ల పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి ఆశీర్వాదంతో వందలాది మంది ఉమ్మడి జిల్లాలో సర్పంచ్‌లుగా గెలుపొందారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులు కేటాయిస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై క్షేత్ర స్థాయిలో తీవ్రమైన వ్యతిరేక ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై సర్వత్రా జనాలంతా మండిపడుతున్నారు. ఇదేమి ప్రభుత్వం అంటూ నిట్టూరుస్తున్నారు.
ఈ దుస్థితిలో కాంగ్రెస్ పార్టీకి పుర పోరులో ఆశించిన స్థాయిలో లాభం జరగడం కష్టతరంగా మారింది. కాంగ్రెస్ ధీటుగా సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్ధతు భారీగా వెల్లువెత్తే అవకాశం ఏర్పడింది. అందులో భాగంగా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు ఇష్ట పడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మూకుమ్మడి కొట్లాటలు రోజుకో విధంగా వెలుగు చూస్తున్నాయి. సమన్వయ లేమి, ప్రభుత్వ వ్యతిరేకత, పట్టణాల్లో కుంటు పడిన అభివృద్ధితో మున్సిపాలిటీ, కార్పొరేషన్లు కుదేలయ్యాయి. పురపాలక, నగరపాలక సంస్థల్లో చెత్త సేకరణ ప్రక్రియ సైతం సరిగ్గా జరగడం లేదు. దీంతో కాంగ్రెస్ సర్కారు తీరుపై పట్టణవాసులంతా తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉండగా ఓటు రూపంలో పుర పోరులో ఈ విషయం ప్రస్ఫుటం కానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.