మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ సత్తాచాటింది. తాము మనసు పెట్టి ఆడితే ఎంతటి ప్రత్యర్థి అయినా బలాదూర్ అంటూ చేతల్లో చూపెట్టింది. కీలకమైన ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపిస్తూ ముంబై క్వాలిఫర్-2లోకి దూసుకెళ్లింది. రోహిత్‌శర్మ ధనాధన్ అర్ధసెంచరీకి తోడు బెయిర్‌స్టో, సూర్యకుమార్ మెరుపులతో భారీ స్కోరు అందుకున్న ముంబై..గుజరాత్‌ను కట్టడి చేయడంలో సఫలమైంది. లక్ష్యఛేదనలో సాయి సుదర్శన్ సూపర్ అర్ధసెంచరీతో ఒంటరిపోరాటం చేసినా జట్టు గెలుపు తీరాలకు చేరలేకపోయింది. సమిష్టి బౌలింగ్‌తో గుజరాత్ నడ్డివిరుస్తూ ముంబై విజయకేతనం ఎగురవేసింది.
IPL | ముల్లాన్‌పూర్: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ముందంజ వేయగా, గుజరాత్ టైటన్స్ తమ పోరాటాన్ని ముగించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత రోహిత్‌శర్మ(50 బంతుల్లో 81, 9ఫోర్లు, 4సిక్స్‌లు) అర్ధసెంచరీతో కదంతొక్కగా, బెయిర్‌స్టో(47), సూర్యకుమార్(33), తిలక్శర్మ(25) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 228/5 స్కోరు చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ(2/53), సాయికిషోర్(2/42) రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 208/6 స్కోరుకు పరిమితమైంది. సాయి సుదర్శన్(49 బంతుల్లో 80, 10ఫోర్లు, సిక్స్) ఒంటరిపోరాటం చేయగా, సుందర్(48) ఆకట్టుకున్నాడు. బౌల్ట్ (2/56) రెండు వికెట్లు తీయగా, బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వని ఒక్కో వికెట్ తీశారు.
సుదర్శన్ పోరాడినా:
నిర్దేశిత లక్ష్యఛేదనలో గుజరాత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(1)ను బౌల్ట్ తన తొలి ఓవర్లోనే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బౌల్ట్ స్వింగ్‌ను సరిగ్గా అర్థం చేసుకోని గిల్ తన ఔట్‌పై డీఆర్ఎస్కు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కుశాల్ మెండిస్(20)..సాయి సుదర్శన్‌కు చక్కని సహకారం అందించాడు. ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వీరిద్దరు స్కోరుబోర్డుకు కీలకపరుగులు జతచేయడంతో పవర్‌ప్లే ముగిసే సరికి గుజరాత్ 66 పరుగులు చేసింది. లీగ్‌లో సూపర్‌ఫామ్‌మీదున్న సుదర్శన్ ముంబైపై తన తఢాకా చూపెట్టాడు. ఏ బౌలర్‌ను విడిచిపెట్టని సుదర్శన్ మరోమారు అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. కుశాల్ ఔటైనా..సుందర్‌తో కలిసి సుదర్శన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరు ముంబై బౌలర్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ లక్ష్యం వైపు సాఫీగా సాగారు. అయితే బౌలింగ్ మార్పుగా వచ్చిన బుమ్రా..సుందర్‌ను ఔట్ చేయడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఆ తర్వాత స్వీప్ షాట్ ఆడబోయిన సుదర్శన్ వికెట్ ఇచ్చుకోగా, రూథర్‌ఫర్డ్(24), తెవాటియా(16 నాటౌట్), షారుఖ్‌ఖాన్(13) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఆఖరి ఓవర్లో గుజరాత్ విజయానికి 24 పరుగులు అవసరమైన స్థితిలో 3 పరుగులే చేసి ఓటమి వైపు నిలిచింది.
రోహిత్ ధమాకా
గుజరాత్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించి బౌలింగ్‌తో కట్టుదిట్టం చేస్తామన్న ఉద్దేశంతో ముంబై ముందుకు సాగింది. కెప్టెన్ అంచనాలకు తగ్గట్టు గానే ఓపెనర్లు రోహిత్‌శర్మ, జానీ బెయిర్‌స్టో జట్టుకు మెరుగైన శుభారంభాన్ని అందించారు. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి బౌలింగ్‌లో తీవ్రంగా తడబడుతున్న గుజరాత్..ముంబైతో పోరులోనే అదే ఒరవడి కొనసాగించింది. దీనికి తోడు పేలవ ఫీల్డింగ్‌తో ఆ జట్టు ఆదిలోనే మూల్యం చెల్లించుకుంది. ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్‌శర్మ కొట్టిన షాట్‌ను బౌండరీ వద్ద కొట్జె విడిచిపెట్టడంతో బతికిపోయాడు. సిరాజ్ వేసిన మరుసటి ఓవర్లోనూ రోహిత్‌కు లైఫ్ దక్కింది. 12 పరుగుల వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్‌కీపర్ కుశాల్ మెండిస్ విడిచిపెట్టడంతో ముంబై ఊపిరి పీల్చుకుంది. ప్రసిద్ధ్ 4వ ఓవర్లో బెయిర్‌స్టో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 26 పరుగులు పిండుకున్నాడు. రికల్టన్ స్థానంలో జట్టులోకి వచ్చిన బెయిర్‌స్టో తన విలువ చాటుకున్నాడు.
బౌలింగ్ మార్పుగా వచ్చిన సాయికిషోర్‌ను రోహిత్ 6, 4, 6 కొట్టడంతో 14 పరుగులు వచ్చాయి. దీంతో ప్లేఆఫ్స్ ముగిసేసరికి ముంబై 79 పరుగులు చేసింది. సాయికిషోర్ 8వ ఓవర్లో షాట్ ఆడబోయిన బెయిర్‌స్టో..కొట్జె క్యాచ్‌తో తొలి వికెట్‌గా వెనుదిరగడంతో తొలి వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్(33)..రోహిత్‌కు జత కలిశాడు. ఈ క్రమంలో రషీద్‌ఖాన్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో రోహిత్ ఐపీఎల్లో 7వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఫోర్‌తో అర్ధసెంచరీ మార్ అందుకున్న రోహిత్ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. 12వ ఓవర్లో సూర్యకుమార్ 25 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను మెండిస్ విడిచిపెట్టాడు. సాయికిషోర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ ఔటైనా 14 ఓవర్లు ముగిసే సరికి ముంబై 150 పరుగుల మార్క్ అందుకుంది. ఈ జోరు చూస్తే ముంబైకు భారీ స్కోరు సాధ్యమనుకున్న తరుణంలో రోహిత్ ఔటయ్యాడు. తిలక్‌వర్మ(25) ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. 19వ ఓవర్లో 200 మార్క్ అందుకున్న ముంబైకి కొట్జె వేసిన 20వ ఓవర్లో హార్దిక్ మూడు సిక్స్‌లతో 228 స్కోరు చేరుకుంది.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో(రోహిత్ 81, బెయిర్‌స్టో 47, సాయికిషోర్ 2/42, ప్రసిద్ధ్ కృష్ణ 2/53), గుజరాత్: 20 ఓవర్లలో 208/6(సాయిసుదర్శన్ 80, సుందర్ 48, బౌల్ట్ 2/56, సాంట్నర్ 1/10)