ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని హసన్, హుస్సేన్ పీర్ల మసీదుకు భక్తజనం పోటెత్తింది. మొహరం వేడుకల్లో ( Muharram celebrations ) భాగంగా మండల కేంద్రంలో (నవమి) సవారి ఊరేగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ( Maharastra ) , కర్ణాటక ( Karnataka ) నుంచి భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు.
భక్తుల రాకతో మండల కేంద్రంలో సందడి నెలకొంది. భక్తులు మేళ తాళాలతో పెద్ద పీర్ల గడ్డ హసన్, హుస్సేన్ పీర్ల చావడీని దర్శించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి హాజరైన భక్తులు హసన్, హుస్సేన్ లకు గొర్రెలు, మేకలతో కందూర్లు నిర్వహించి మొక్కులు చెల్లించు కున్నారు. మరి కొందరు బెల్లం, పుట్నాలు, గోధుమలతో తయారుచేసిన మలీజా నైవేద్యాన్ని సమర్పించుకున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే అత్యంత వైభవంగా జరిగే ఊట్కూర్ మొహరం ఉత్సవాల్లో భాగంగా చిరు వ్యాపారులు గాజులు, మిఠాయి, ఆట వస్తువుల దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన వందమంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
నారాయణపేట డీఎస్పీ లింగయ్య, సీఐ రామ్ లాల్, ఎస్సై రమేష్ బందోబస్తును పర్యవేక్షించారు. ఎంపీడీవో ధనుంజయ గౌడ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీరు, వెహికిల్ పార్క్ వసతిని కల్పించారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.