మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 25: మల్లారెడ్డి యూనివర్సిటీలో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం వచ్చేనెల 12, 13 తేదీల్లో ఎంఆర్యూసెట్ నిర్వహించనున్నట్టు వీసీ వీఎస్కే రెడ్డి చెప్పారు. మార్చి 11 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. శుక్రవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఉపకార వేతనాలు అందజేయాలని వర్సిటీ యాజమాన్యం నిర్ణయించిందని, ఇందుకోసం రూ.5 కోట్లను కేటాయించిందని వివరించారు. ఉపకార వేతనాలు పోను రూ.4 లక్షలు, రూ.5 లక్షల్లోనే నాలుగేండ్ల ఇంజినీరింగ్ విద్య పూర్తవుతుందని చెప్పారు. 200 ఎకరాల్లో స్థాపించిన వర్సిటీలో అత్యాధునిక, అంతర్జాతీయస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. వర్సిటీ డైరెక్టర్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్, ఫార్మసీ మేనేజ్మెంట్ కోర్సుల్లో వర్సిటీ అతిపెద్ద సంస్థ అన్నారు. త్వరలో వర్సిటీలో ఇన్నోవేషన్ హబ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కంపెనీ పెట్టుకునేందుకు ముందుకొచ్చే విద్యార్థులకు రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు నిధులను సమకూర్చే బాధ్యతను విశ్వవిద్యాలయం తీసుకుంటుందని చెప్పారు. సమావేశంలో తెలంగాణ ఐటీ అడ్వైజర్ జేఏ చౌదరి, ఆర్ అండ్ డీ డీన్ డాక్టర్ ప్రమోద్, స్కూల్ ఆఫ్ సైన్స్ డీన్ కైలాశ్రావు, రిజిస్ట్రార్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.