MP Vaddiraju Ravichandra : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)కు నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) ఖండించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం క్లీన్ చిట్ ఇస్తూ తీర్పు చెప్పిందని, అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావలసిందిగా కోరుతూ హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం తీవ్ర అభ్యంతరకరమని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది వద్ధిరాజు విమర్శించారు. కాంగ్రెస్ పాలకుల బెదిరింపులు, అక్రమ కేసుల బనాయింపులు, వేధింపులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడవని, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు అండగా ఉంటూ ముందుకు సాగుతమని ఆయన పేర్కొన్నారు.