హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): మావోయిస్టులు లొంగిపోయినంత మాత్రాన ఉద్యమాలు ఆగిపోతాయనుకోవడం పొరపాటేనని సీపీఐ జాతీయ నేత డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. పేదరికం లేని రాజ్యాలు సృష్టిస్తే నక్సలైట్లు ఉండరని తెలిపారు.
మావోయిస్టుల లొంగుబాటుపై ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో దోపిడీదారులు ఉన్నంతకాలం ఏదో ఒకచోట.. ఏదో ఒక రూపంలో ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. చెట్టుకొట్టేస్తే మళ్లీ మొలకలు వస్తాయని, అరాచకాలు, దోపిడీలు పెచ్చుమీరితే మళ్లీ ఉద్యమాలు పుట్టుకొస్తాయని నారాయణ స్పష్టంచేశారు.