కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ముగ్గురు బలయ్యారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో బట్టలు ఉతకడానికి బావి వద్దకు వెళ్లిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తూ అందులో పడి మరణించారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సంగారెడ్డి జిల్లా కంగ్జి మండలం బోర్గి గ్రామానికి చెందిన పరశురామ్, సావిత్రి(30) దంపతులు హైదరాబాద్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. బంధువుల పెండ్లి ఉండటంతో వారం క్రితం సొంత గ్రామానికి కుటుంబంతో వచ్చారు. అయితే గ్రామంలో సరిగ్గా నీటిసరఫరా లేకపోవడంతో బట్టలు ఉతకడానికి సావిత్రి గ్రామ పొలిమేరలో ఉన్న బావి వద్దకు వెళ్లింది. ఆమెతో పాటు ఇద్దరు కూతుళ్లు నిఖిత(10), నందిని (8) వెళ్లారు.
అక్కడ బట్టలు ఉతుకుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ నందిని మొదట బావిలో జారిపడింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించి వరుసగా నిఖిత, సావిత్రి కూడా బావిలో పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వచ్చి బావి నుంచి వారిని వెలికితీశారు. కానీ అప్పటికే ముగ్గురు మరణించారు. ఈ ఘటనపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రావడం లేదని అన్నారు. తాగునీటి కోసం నిత్యం బావి వద్దకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు.