చెన్నై: దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నటన నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. (Vijay’s new Cabinet) ఆదివారం ఉదయం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 9 మంది టీవీకే ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
1. ఎన్. ఆనంద్: విజయ్ పార్టీని ప్రారంభించక ముందే ఆయన అభిమాన సంఘాల సమాఖ్యకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. టీవీకే ఏర్పాటులో కీలకమైన నిర్వహణ, నైపుణ్యాన్ని అందించారు. ఆ పార్టీకి మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఆ పార్టీ ప్రముఖ అధికార ప్రతినిధుల్లో ఆయన కూడా ఒకరు.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలోని త్యాగరాయనగర్ నియోజకవర్గం నుంచి ఆనంద్ పోటీ చేశారు. చారిత్రకంగా డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యం వహించే ఈ స్థానంలో 51,632 ఓట్లు సాధించారు. డీఎంకే అభ్యర్థి రాజా అన్బళగన్‌ను ఆయన ఓడించారు.
2. ఆధవ్ అర్జున: 6 అడుగుల 7 అంగుళాల ఎత్తుతో ఆకట్టుకునే మాజీ జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు ఆధవ్ అర్జున. తమిళనాడుకు చెందిన రాజకీయ వ్యూహకర్త, దాత, క్రీడా నిర్వాహకుడు. గత ఎన్నికల్లో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌తో ఆయన పనిచేశారు. డీఎంకే విజయంలో కీలక పాత్ర పోషించారు.
2026 ఎన్నికల్లో చెన్నైలోని విల్లివాక్కం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా ఆధవ్ అర్జున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీలో ఎన్నికల ప్రచార నిర్వహణకు సంబంధించిన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తద్వారా పార్టీ అధ్యక్షుడు విజయ్, ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ తర్వాత టీవీకేలో అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న నాయకుడిగా ఆయన నిలిచారు. బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.
3. ఎస్ కీర్తన: విజయ్ కేబినెట్లో ఏకైక మహిళా మంత్రి. తమిళనాడులోని బాణసంచా పరిశ్రమకు కేంద్రమైన శివకాశి నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 29 ఏళ్ల కీర్తన, విజయ్ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కురాలు. హిందీలో అనర్గళంగా మాట్లాడే ఆమె, క్షేత్రస్థాయి రాజకీయ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. పార్టీ ఎన్నికల వ్యూహంలో కీలక పాత్ర పోషించారు. రాజకీయ సలహాదారుగా కూడా పనిచేశారు. శివకాశిలోని బాణసంచా పరిశ్రమల కార్మికులకు క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, మహిళలకు సమాన వేతనం కల్పిస్తామని కీర్తన హామీ ఇచ్చారు.

Vijay New Cabinet
4. డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్: తమిళనాడుకు చెందిన వైద్యుడు, మాజీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. టీవీకే పార్టీకి విధాన, ప్రచార వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో నామక్కల్ జిల్లాలోని తిరుచెంగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
5. డాక్టర్ టీకే ప్రభు: ఆయన దంత వైద్యుడు. టీవీకేలో కీలక నేత. కారైకుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. విజయ్ తొలి కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
6. కేఏ సెంగోట్టయ్యన్: అన్నాడీఎంకేలో అత్యంత సీనియర్ నేత. ఐదు దశాబ్దాల అనుబంధం తర్వాత గత సంవత్సరం ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. విజయ్ పార్టీలో చేరి తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు.
7. పి వెంకటరమణన్: న్యాయవాది అయిన ఆయన చెన్నైలోని కీలకమైన మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీవీకే ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీవీకే కోశాధికారిగా ఆయన వ్యవహరిస్తున్నారు. క్రియాశీల రాజకీయాలకు కొత్త అయినప్పటికీ, 2000 నుంచి విజయ్‌కు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు చాలాకాలంగా సన్నిహితుడిగా ఉన్నారు.
8. నిర్మల్ కుమార్: టీవీకే ఐటీ, సోషల్ మీడియా శాఖ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఆయన ఉన్నారు. మదురైలోని తిరుప్పరన్కుండ్రం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
9. రాజమోహన్ అరుణ్ముగం: నటుడు, స్టాండ్-అప్ కమెడియన్, ప్రేరణాత్మక వక్తగా బహుముఖ పాత్రలు పోషించారు. చెన్నైలోని ఎగ్మోర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీవీకే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విజయ్ తొలి కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.