హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : మావోయిస్టు పార్టీకి ఇటీవల జనరల్ సెక్రటరీగా ఎన్నికైన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నాడా? ఏపీలో పట్టుబడిన వారిలోని నలుగురు కీలక నేతల్లో అతను కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లొంగుబాటు ప్రణాళికలో భాగంగా ఏఓబీ నుంచి హిడ్మా రావాల్సి ఉండగా.. ముందుగానే తిప్పరి తిరుపతి విజయవాడకు వచ్చినట్లు సమాచారం. ఒకవేళ లొంగుబాటు ప్రయత్నాలు సఫలం కాకపోతే.. ఏపీ నుంచి తమిళనాడుకు వెళ్లేందుకు కూడా వారు ప్రణాళికలు రచించారని ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో దేవ్‌జీ పట్టుబడి ఉంటాడని అంటున్నారు. ఏపీ పోలీసులు పలుచోట్ల నిర్వహించిన సోదాల్లో మొత్తం 50 మందికి పైగానే అరెస్టు చేసినట్లు తెలిసింది. మంగళవారం ఉదయం హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆ వెంటనే ఏపీలోని పలు చోట్ల పోలీసులు మెరుపు దాడులు చేశారు. విజయవాడ పెనుమలూరులోని ఒక భవనంలో.. ఏలూరులోని ఒక అపార్ట్మెంట్లో.. కాకినాడలోని ఒక ఇంటివద్ద కూడా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు చుట్టుముట్టి సోదాలు చేశారు.
విజయవాడ పెనుమలూరు సమీపంలోని న్యూ ఆటోనగర్‌లోని ఓ అద్దె భవనంలో మొత్తం 31 మంది మావోయిస్టులు పట్టుబడ్డారని అధికారులు స్వయంగా వెల్లడించారు. అందులో మహిళలే ఎకువగా ఉన్నారని.. ఎకువమంది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు అని ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. పట్టుబడిన వారిలో కీలక నేతలు ఉన్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ తెలిపారు. వీరంతా పెద్ద లీడర్స్‌కు రక్షణగా ఉండే ఆర్మీ టీం సభ్యులని కూడా అధికారులు తెలిపారు. పట్టుబడిన వారిలో దేవ్ జీకి రక్షణగా ఉండే వారు 9 మంది ఉండటంతో.. అతను కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం పట్టుబడిన కీలక నేతల పేర్లు వెల్లడించలేదు. ప్రస్తుతం వారందరినీ ఆక్టోపస్, టాస్ ఫోర్స్ కార్యాలయాలకు తరలించారు. ఏలూరులో నిర్వహించిన సోదాల్లో 12 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. కాకినాడ, తిరుపతిలో కూడా కొందరిని అరెస్టు చేశారని, వారిని నేడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. కాగా తిరుపతికి సంబంధించిన ప్రచారాన్ని పోలీసులు నిర్ధారించలేదు.