హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఓ బూటకమని తెలంగాణ పౌరహక్కుల సంఘం అభిప్రాయపడింది. కోవర్టు ఆపరేషన్‌తోనే వారిని మట్టుబెట్టారని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇంకా అనేక మంది మావోయిస్టులను పోలీసులు బందీలుగా పట్టుకున్నారని, వాళ్లందరినీ తక్షణం కోర్టులో హాజరు పర్చాలని తెలంగాణ పౌరహకుల సంఘం అధ్యక్షుడు ప్రొ.గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణ రావు డిమాండ్ చేశారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ బూటకమని రైతుకూలీ సంఘం (ఆర్సీఎస్) అభిప్రాయపడింది. సామ్రాజ్యవాదుల కోసం భారత సైన్యం దేశ పౌరులనే వేటాడటం ఖండించాలని ఆర్సీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పటోళ్ల నాగిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం పిలుపునిచ్చారు. ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్‌రాజ్ పరిపాలనను తలపిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మావోయిస్టులను చంపుకుంటూపోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాల పోలీసులు కూడా పావులుగా మారారని ఆయన పేర్కొన్నారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌తోపాటు ఇంతకుముందు జరిగిన ఎన్కౌంటర్లన్నీ బూటకమని తెలిపారు.
ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ, అర్బన్ నక్సల్స్ ఆస్తులు పెంచుకుంటే..వారు సృష్టించిన భ్రమలో చిక్కుకున్న గిరిజన యువత జీవితాలను కోల్పోయిందని అన్నారు. హిడ్మా, అతని భార్య చివరికి ఏమి సాధించారు? అని ప్రశ్నించారు. ఏసీ గదుల్లో విలాసవంతమైన జీవితాలను గడుపుతున్న అర్బన్ నక్సలైట్లు సృష్టించిన భ్రమలో పడొద్దని గిరిజన యువతకు పిలుపునిచ్చారు. మావోయిస్టులు లొంగిపోవాలని కోరారు.