హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా లొంగుబాట పట్టారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ నేతృత్వంలో భారీగా క్యాడర్ లొంగిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. ఇటీవల ఆయన తెలంగాణ పోలీసులను సంప్రదించినట్టు సమాచారం. కాగా నేడో రేపో ఆయనతోపాటు డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్, వారితో వచ్చిన క్యాడర్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో కీలక సభ్యుడిగా, భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఆజాద్ కీలకంగా ఉన్నారు.
వీరితోపాటు 20 మంది వరకు డివిజనల్, ఏరియా కమిటీల సభ్యులు లొంగిపోయేందుకు కార్యాచరణ పూర్తయినట్టు సమాచారం. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడేనికి చెందిన ఆజాద్ 1995లోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. రాష్ట్రకమిటీ కార్యదర్శి హరిభూషణ్ మృతి తర్వాత ఆ హోదా కోసం ఆజాద్, మరో రాష్ట్రకమిటీ సభ్యుడు బడే చొకారావు అలియాస్ దామోదర్ మధ్య పోటీ నెలకొంది. దీంతో అప్పట్లో చంద్రన్న నేతృత్వంలోనే తెలంగాణ కమిటీని కొనసాగించారు. ఇటీవల దామోదర్‌ను రాష్ట్రకమిటీ కార్యదర్శిగా నియమించగా.. మారిన పరిస్థితుల కారణంగా ఆజాద్ లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. అతనితోపాటు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎఫ్‌సీఐ ప్రాంతానికి చెందిన రమేశ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ టెక్నికల్ టీమ్ ఇన్చార్జిగా ఉన్నారు.