చేర్యాల, మే 4 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి భక్తులకు మెరుగైన వసుతుల కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. బుధవారం మల్లన్న ఆలయంలో చైర్మన్ గీస భిక్షపతి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా చైర్మన్, ఈవో ఏ.బాలాజీ, ధర్మకర్తలు ఆలయానికి సంబంధించిన వివిధ అంశాల పై చర్చించడంతో పాటు పలు తీర్మానాలు చేశారు.అనంతరం తీర్మానాలను చైర్మన్ భిక్షపతి విలేకరులకు వెల్లడించారు.సర్వే నెం 561లో ప్రైవేటు వ్యక్తుల స్ధలానికి బదులుగా సర్వే నెం.228లోని దేవస్థాన స్థలం మార్పిడి లాండ్ ఎక్చేంజ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
అలాగే మల్లన్న క్షేత్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ గణపతి దేవాలయం, శ్రీ వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవాలర్ల ఆలయాలలో విగ్రహప్రతిష్ట మహోత్సవాలను ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. సర్వే నెం.561 నందు తొలగించిన బిల్డింగ్ల స్థలంలో గ్యాలరీలు, మూడు లైన్ల క్యూలైన్ల ఏర్పాటు చేసేందుకు ప్లాన్, ఎస్టిమేట్లు తయారు చేయాలని ఇంజినీరింగ్ విభాగానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
సమావేశంలో ఏఈవో వైరాగ్యం అంజయ్య, ధర్మకర్తలు టి.రమేశ్, పి.కొమురెల్లి, దరావత్ అనిత, కె.గిరిధర్, టి.శ్రీనివాస్, సిహెచ్.పర్శరాములు, ముత్యం నర్సింహులు, చిట్టె అయిలయ్య, అమర్ తదితరులు పాల్గొన్నారు.