దారిలో ఎవరికైనా ఆపదొస్తే మనకేందుకులే అని అనుకుంటాం. గాయాలతో బాధపడుతుంటే ‘అమ్మో’ అంటూ దూరంగా జరిగిపోతాం. కానీ ఆయన మాత్రం అలా కాదు. ఏ సంబంధం లేని వారి కష్టాల్లో తోడుగా నిలుస్తాడు. గాయపడిన వారికి సాయం చేస్తాడు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తాడు. కాలం తీరిన వారిని చివరి మజిలీ దాకా సగౌరవంగా సాగనంపుతాడు బోయిగూడకు చెందిన మొగిలిపల్లి శ్రీనివాస్ గుప్త. 33 ఏండ్లుగా నిస్వార్థంగా వేలాది అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన ఈ నిజమైన సామాజిక సేవకుడు బతుకమ్మతో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..
మా పూర్వికులది జనగామ దగ్గర కొల్కొండ ప్రాంతం. మా నాన్న చిన్నవయసులోనే హైదరాబాద్‌కు వలసొచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఆయన కుటుంబాన్ని పోషించడం కోసం ఆల్ఫా హోటల్లో పనిచేసేవారు. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ బోయిగూడలోనే. ఏడో తరగతిలో ఉన్నప్పుడు బడికి వెళ్తుండగా మోండా మార్కెట్ పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడు. అది గమనించిన నేను వెంటనే అతణ్ని గాంధీ దవాఖానలో చేర్చాను. ఆయనకు వారంరోజులపాటు సేవలందించాను. ఆ వయసులో నేను చేసిన ఆ సహాయానికి ఆయన కుటుంబ సభ్యులు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పారు.
స్థానికులు మెచ్చుకున్నారు. మంచి పనులు చేస్తే పదిమంది మెచ్చుకుంటారని ఆ సమయంలోనే తెలిసొచ్చింది. ఉన్నన్ని రోజులు పదిమందికి సహాయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఇక అప్పటినుంచి ఒకవైపు నా చదువు కొనసాగిస్తూనే రోడ్డు పక్కన సహాయమని ఎవరు అడిగినా నా చేతనైనంత చేసేవాణ్ని. మరోవైపు మాది కూడా పేద కుటుంబమే కావడంతో చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు ఎత్తుకున్నాను. నాన్నకు తోడుగా దొరికిన పనల్లా చేస్తూ ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేశాను. చదువుకు ఆటంకం కలగకుండా డిగ్రీ పూర్తి చేశాను.

ఉద్యోగం చేస్తే సేవా కార్యక్రమాలకు దూరమవుతాననే భయంతో ప్రైవేట్ వాహనాలు సేల్స్ అండ్ పర్చస్ వ్యాపారం చేయడం ప్రారంభించాను. అందులో వచ్చిన ఆదాయంతో కుటుంబ ఖర్చులకు పోనూ ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మొదట్లో రోడ్డు పక్కన ఉండే నిరాశ్రయులు, వృద్ధులను చూసి చలించిపోయేవాణ్ని. తెలిసిన అనాథాశ్రమం, వృద్ధాశ్రమాల్లో వారిని చేర్పిస్తే.. ‘వీళ్లు మరణిస్తే మీ బాధ్యతనే’ అంటూ నిర్వాహకులు షరతు పెట్టారు. అందుకు కూడా ఒప్పుకొన్నాను.
ఆరోగ్యం క్షీణించి, పుట్‌పాత్‌లపై ఇబ్బందులు పడేవారిని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో చేర్పించి, వారికి చికిత్స చేయించేవాణ్ని. ఈ సేవలు చేస్తున్న తరుణంలోనే చివరి మజిలీకి నోచుకోని అనాథ శవాలను చూసి ఎంతో బాధేసింది. కొంతమంది అంత్యక్రియలు చేసే స్తోమత లేక సొంతవాళ్లను కూడా అనాథ శవాలుగా వదిలేసిన ఉదాహరణలెన్నో నన్ను బాధపెట్టాయి. ఆ అనాథలుగా కన్నుమూసిన వారి ఆత్మకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో వారికి అంతిమ సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నాను.

అనాథ శవాలు, ఆర్థిక స్తోమతలేక అంత్యక్రియలు కూడా చేయలేని స్థితిలో ఉండే వారికి అంత్యక్రియలు చేస్తున్నాను. ఇప్పటివరకు సుమారుగా 8,500 మందికి పైగా అంత్యక్రియలు జరిపించాను. ఇందులోనూ ఎవరి మతాచారం మేరకు వారి కర్మకాండలు నిర్వహిస్తున్నాను. ఒక్కో అంత్యక్రియకు రూ.7000 వరకు ఖర్చు అవుతుంది. ఆ డబ్బంతా నేను సంపాదించే దాంట్లోంచే ఖర్చు పెడతాను తప్ప మరొకరి ఆర్థిక సహాయం మాత్రం తీసుకోను. అక్కడితోనే నా పనైపోయిందని భావించకుండా వారి అస్తికలను సైతం గంగమ్మ చెంతకు చేరుస్తాను.
అప్పుడే వారి ఆత్మ శాంతిస్తుందని బలంగా నమ్ముతాను. ఈ సేవకు పలానా సమయమంటూ ఉండదు. అర్ధరాత్రైనా, అపరాత్రైనా నా కర్తవ్యం నిర్వర్తిస్తూనే ఉంటాను. నా పెళ్లి నాడు కూడా ఓ అమ్మాయి ఉరేసుకొని చనిపోతే నేనే వెళ్లి దింపాను. ఒకప్పుడు రిక్షా మీద తీసుకొచ్చి దహనం చేసేవాణ్ని. ప్రస్తుతం నాకున్న అంబులెన్స్‌లోనే చివరి మజిలీకి చేరుస్తున్నాను.

1992 నుంచి ఆపదలో ఉన్నవారి కష్టాలే నా కష్టాలుగా భావించి సేవ చేస్తున్న నాకు 2010లో నా చిన్నకొడుకు మరణం కలిచివేసింది. అనారోగ్యంతో వాడు చనిపోవడంతో కుటుంబమంతా శోకంలో మునిగింది. వాడి గుర్తుగా 2015లో ‘రియల్ వివేక్ ఫౌండేషన్’ ప్రారంభించాను. నేను చేసే ప్రతి సేవా కార్యక్రమంలో నా కొడుకును చూసుకుంటాను.
ప్రస్తుతం నాకున్న పదకొండు అంబులెన్స్‌లనూ సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తున్నాను. నా కుటుంబం కూడా నేను చేసే సేవకు అండగా నిలుస్తున్నది. ఇప్పటివరకు నేను చేసిన ఈ సేవకు ఎవరినుంచి కూడా ఒక్కరూపాయి యాచించలేదు. అడగను కూడా! నా కాళ్లు చేతులు బాగున్నన్ని రోజులు ఈ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా చేస్తునే ఉంటాను. అందులోనే నాకు అసలైన సంతృప్తి.
– రాజు పిల్లనగోయిన