మెదక్, మార్చి 13: రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రూ.66 కోట్లతో మోడ్రన్ ధోబీఘాట్లను నిర్మిస్తామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం మెదక్ పట్టణంలో రజకుల ఆత్మగౌరవ సభలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా చాకలి ఐలమ్మ, సంత్ గార్గేబాబా విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో రూ.2 కోట్లు వెచ్చించి మోడ్రన్ ధోబీఘాట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వృత్తిపై ఆధారపడ్డ రజకులు, నాయీబ్రాహ్మణులకు ఉచిత కరెంటు ఇస్తున్నామని తెలిపారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.300 కోట్లను కేటాయించినట్టు చెప్పారు. రజకుల ఆర్థికాభివృద్ధికి 80 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు, రైతుబంధు, రైతుబీమా వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. 60 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు 3 మెడికల్ కళాశాలను ఏర్పాటుచేస్తే.. ఆరేండ్లలో 33 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గాంధీ, ఉస్మానియా దవాఖానలకు వెళ్లకుండా మెదక్ పట్టణంలోనే 550 పకడల దవాఖాన నిర్మిస్తామని వెల్లడించారు. జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాలతోపాటు నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సొంత జాగాలో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. డబుల్ బెడ్రూం పథకం కూడా కొనసాగుతుందని ఉద్ఘాటించారు. తండాల్లో రూ.600 కోట్లతో 2,500 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు, వెయ్యి కోట్లతో సీసీ రోడ్లు నిర్మించనున్నట్టు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.