హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : క్రిస్మస్ పండుగకు రెండు రోజుల సెలవులు ప్రకటించిన ఘనత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుదేనని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత సిరికొండ మధుసూదనాచారి ప్రశంసించారు. కిస్మస్ గిఫ్ట్‌గా దుస్తులు ఇవ్వడంతోపాటు ఎల్బీ స్టేడియంతోపాటు రాష్ట్రంలోని పల్లె పల్లెన విందులు ఏర్పాటు చేసిన గొప్ప మనసు కేసీఆర్ ప్రభుత్వానిదని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో మంగళవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్‌చేసి ప్రసంగించారు. ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసిన మహనీయుడు ఏసుక్రీస్తు అని పేర్కొన్నారు. క్రీస్తుకు ముందు, తర్వాత అని మనం అంటున్నామంటే ఆయన ప్రభావం ప్రపంచంమీద ఎంత లా ఉందో అర్థమవుతున్నదని చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక క్రిస్మస్కు రాష్ట్ర పండుగ గుర్తింపు ఇచ్చారని గుర్తుచేశారు. క్రిస్టియన్లకు ఉప్పల్ భగాయత్‌లో రెండు ఎకరాల స్థలం కేటాయించడంతోపాటు భవన నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించారని చెప్పారు. క్రైస్తవుల సమాధుల కోసం 45 ఎకరాలకుపైగా స్థలాన్ని కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరు చేశారని తెలిపారు. కేసీఆర్ క్రైస్తవుల కోసం చేసిన ఎన్నో పనులు ఇపుడు రేవంత్ ప్రభుత్వంలో జరగడం లేదని, ప్రభుత్వం మారితే పథకాలు రద్దు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
క్రైస్తవుల ప్రయోజనాల కోసం కేసీఆర్ ఎంతగానో పరితపించారని తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో 15 నుంచి 20 వేల మందికి క్రిస్మస్ విందు కేసీఆర్ హయాంలోనే మొదలైందని గుర్తుచేశారు. ఎల్బీ స్టేడియంలో మొన్న జరిగిన కార్యక్రమంలో సహపంక్తి భోజనం చేయకుండానే రేవంత్‌రెడ్డి వెళ్లిపోవడం క్రిస్టియన్లను బాధించిందని పేర్కొన్నారు. క్రైస్తవ భవన్‌కు కేసీఆర్ నిధులు కేటాయించినా ఈ ప్రభుత్వంలో కనీసం ఒక ఇటుక కూడా వేయలేదని విమర్శించారు. క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్‌గా తెలంగాణలో ఎవరూ లేనట్టు కేరళకు చెందిన వ్యక్తిని నియమించారని మండిపడ్డారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో క్రైస్తవులకు ప్రకటించిన ఏ ఒక హామీ కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి సహా పార్టీ నేతలు, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపించిన క్రీస్తు గేయాలు అలరించాయి.