MLC Kavitha | హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టీ రవీందర్ రావు, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమ భరత్
ప్రకటన విడుదల చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.
కవిత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. పార్టీ లైన్ దాటి కవిత పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. కేసీఆర్ వెంట దెయ్యాలు ఉన్నారని గతంలో ఆమె వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై కూడా బహిరంగ విమర్శలు చేశారు. తాజాగా కాళేశ్వరం రిపోర్టుపై స్పందిస్తూ.. హరీశ్‌రావు, సంతోష్ రావుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. కవిత వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Kavitha Suspend