KTR | హైదరాబాద్ : ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ కీటెక్స్ (Kitex) వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని కొత్త యూనిట్లో వాణిజ్య ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది. ఈ కీలక పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో ఒక చారిత్రాత్మక ఘట్టమన్నారు.
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా తన సంతోషాన్ని కేటీఆర్ పంచుకున్నారు. ఈ వార్త తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతున్న క్లిష్ట సమయంలో కీటెక్స్ అధినేత సాబు జాకబ్‌తో జరిపిన వాట్సాప్ చర్చలు తనుకు ఇంకా గుర్తున్నాయన్నారు. కేరళ నుంచి కీటెక్స్ను తెలంగాణకు రప్పించడానికి చేసిన ప్రయత్నం అంతా ఇంకా తన కళ్ల ముందే కనిపిస్తుందన్నారు. కీటెక్స్తో వందలాది తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్న తన నమ్మకం వృథా కాలేదన్నారు. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించడంపై కీటెక్స్ యాజమాన్యానికి, ఉద్యోగులకు కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను అందుకోవాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ దార్శనికతకు దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ అయిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిలువుటద్దం అని కేటీఆర్ అన్నారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, కేసీఆర్ నాయకత్వం, అవినీతిరహిత పాలనతోనే కీటెక్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ తెలంగాణకు తరలివచ్చిందని, రాబోయే రోజుల్లో తెలంగాణ ఆర్థిక ప్రగతిలో కీటెక్స్ కీలక పాత్ర పోషిస్తుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.
ప్రపంచంలోని అతిపెద్ద పిల్లల వస్త్రాల తయారీ సంస్థలలో కేరళకు చెందిన కీటెక్స్ గార్మెంట్స్ ఒకటి.
వరంగల్‌లో కొత్తగా ప్రారంభమైన ఈ యూనిట్ తో రోజుకు 1.1 మిలియన్ (11 లక్షల) పిల్లల రెడీమేడ్ వస్త్రాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడిన కీటెక్స్ ఈ వరంగల్ యూనిట్ తో త్వరలోనే యూకే, రష్యా వంటి కొత్త మార్కెట్లలోకి ప్రవేశించి తన వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తుంది.
ఇప్పటికే కంపెనీ హైదరాబాద్ సమీపంలోని సీతారాంపూర్‌లో తన రెండవ భారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసింది. దీని ఉత్పత్తి సామర్థ్యం కూడా దాదాపు వరంగల్ యూనిట్‌కు సమానంగా ఉండనుంది.