24 గంటల కరెంటును యావత్తు ప్రపంచం పొగుడుతున్నది. రైతుల పంటలు పెరుగుతున్నయ్. దర్జాగా కాలు మీద కాలేసుకొని పంటలు పండించుకుంటున్నరు. అలాంటిది ఎవరో చెప్తే 24 గంటల కరెంటును బంజేయం. 100 శాతం కొనసాగిస్తం.
– గతంలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్
అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకొన్నది. ఉచిత కరెంటు వద్దన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నోటికాడిబుక్కను ఎత్తగొట్టే కాంగ్రెస్ ఆలోచనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ దిష్టిబొమ్మలు దహనం చేసి తమ కోపాగ్నిని ప్రదర్శించారు. రైతు వ్యతిరేక ఆలోచనలను బూడిద చేస్తామంటూ హెచ్చరించారు. 3 గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్‌ను గ్రామాల్లోకి రానిచ్చే ప్రసక్తే లేదని పొలిమేర్లలో బోర్డులను ఏర్పాటుచేశారు. ఆ పార్టీకి ఓటు వేయబోమని తీర్మానాలు చేశారు. 24 గంటల కరెంటిచ్చి సాగును కేసీఆర్ పండుగగా మార్చితే.. ఈ కాంగ్రెసోళ్లు రైతుల పొట్ట కొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రైతులకు 3 గంటల విద్యుత్తు చాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. రాహుల్‌గాంధీ వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ మొత్తం బోగస్ అని తేటతెల్లమయ్యిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. రాహుల్‌గాంధీ మాటలన్నీ డొల్ల అని తేలిపోయిందని చెప్పారు. మూడు గంటల ఉచిత విద్యుత్తు చాలంటున్న రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటిదాకా ప్రజల్లో తిరుగవద్దని హెచ్చరించారు. మూడు పూటలా అన్నం పెట్టే రైతుకు 3 గంటలే కరెంటు ఇవ్వాలంటున్న రేవంత్‌రెడ్డిని ఊరి పొలిమేరల దాకా తరిమి కొట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం హైదరాబాద్ విద్యుత్తుసౌధ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించి, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యుత్తు సౌధ ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పేదాకా గ్రామాల్లో తిరగనీయొద్దని పిలుపునిచ్చారు. 60 ఏండ్లపాటు కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో అర్ధరాత్రి మోటర్లు ఆన్ చేయడానికి వెళ్ల్లి రైతులు పాము, తేలు కాట్లకు గురయ్యేవారని, ఇవాళ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని వివరించారు. కాంగ్రెస్ అసలు ఉద్దేశాన్ని రేవంత్‌రెడ్డి అమెరికాలో బయటపెట్టాడని, ఆయనకు వ్యవసాయం తెలియదని మండిపడ్డారు.
రాష్ర్టాన్ని 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీ రైతుల కోసం ఏమీ చేయలేదని కవిత విమర్శించారు. 60 ఏండ్లలో ఏడు వేల మెగావాట్ల విద్యుత్తును మాత్రమే ఉత్పత్తి చేస్తే.. తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ పాలనలో అదనంగా పదివేల మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. రైతుల కోసం నిరంతరం కష్టపడి భూ రికార్డులను ప్రక్షాళన చేసి, విద్యుత్తు ఉత్పత్తిని పెంచి, సబ్స్టేషన్లు నిర్మించి అభివృద్ధి చేశామని, రూ.లక్ష కోట్లతో విద్యుత్తు వ్యవస్థను మెరుగుపరిచామని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ మిగులు విద్యుత్తు రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు. రైతులకు కడుపునిండా ఉచితంగా విద్యుత్తును ఇచ్చుకుంటామని, రైతు బాగుంటే కాంగ్రెస్‌కు ఎందుకు కండ్లమంట? కడుపు మంట? అని ప్రశ్నించారు.
వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ దే శానికే ఆదర్శంగా నిలిచిందని, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానానికి చేరిందని కవిత తెలిపారు. రైతుబంధు పథకాన్ని ఇతర రాష్ట్రాలు నకలు కొట్టే ప్ర యత్నం చేస్తున్నాయని చెప్పారు. రైతుకు వ్యవసా యం పండగ కావాలంటే నీళ్లు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, విద్యుత్తుతోపాటు పంటను కొనే ప్రభు త్వం ఉండాలని.. దీనిని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్నదని వివరించారు. రాష్ట్రంలో 27.5 లక్షల బోరు బావులపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారని, మిషన్‌కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లతో నీటిమట్టం పెరిగి బోర్లు నిండుగా పోస్తున్నాయని చెప్పారు. ఆ బోరు మోటర్లకు ప్రభుత్వం ఉచిత విద్యు త్తు అందిస్తున్నదని, ఎప్పుడంటే అప్పుడు రైతు బటన్ నొకితే నీళ్లు పారుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్, కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, వనం సంగీతాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఎందుకని అంటున్నడు. ఇదే తరహాలో పరిశ్రమలకు ఇవ్వొద్దనే ధైర్యం ఉన్నదా? జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటికి ఇవ్వాలి. కానీ, రైతులకు వద్దా? రైతులు మాట్లాడలేరని.. ఇష్టం వచ్చిన ట్టు మాట్లాడుతున్నారా? ధైర్యం ఉంటే వ్యాపారవేత్తలకు పవర్బంద్ పెట్టమని చెప్పండి.
-ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
రాష్ట్రంలో రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకంత అక్కసు వెళ్లగక్కుతున్నదని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో ప్రశ్నించారు. ‘రాహుల్‌గాంధీ గారూ.. కాంగ్రెస్ రాష్ట్రాల్లో రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు అందించలేక పోతున్నారన్న కారణంతో తెలంగాణ రైతాంగాన్ని కూడా మీరు ఇబ్బందులపాలు చేయాలనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు.
వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు వద్దన్నందుకు రేవంత్‌రెడ్డి చెంపలు వేసుకోవాలి. ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలి. రైతు వ్యతిరేకి అయిన రేవంత్‌కు రైతులే తగిన గుణపాఠం చెబుతారు. నిన్న ధరణి, నేడు కరెంటు, భవిష్యత్తులో రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను అడ్డుకుంటాడు. ఉచిత కరెంటు, సాగునీరు, పంట పెట్టుబడి సాయంతో రైతులు బాగుపడుతుంటే.. రేవంత్ ఓర్వలేకపోతున్నాడు. రైతుకు కరెంటు రాకుండా కుట్రలు చేస్తే రేవంత్ అడ్రస్ ఉండదు. కాంగ్రెస్ నిజస్వరూపం ఇప్పటికైనా బయటపడింది.
-శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి
వ్యవసాయానికి మూడు గంటలు సరిపోతుందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం దారుణం. రైతులు పంటలు పండించుకొని మంచిగా ఉంటే రేవంత్‌రెడ్డి కండ్లు మండుతున్నాయి. పంటలకు విద్యుత్తు కావాలని అడిగితే రైతులపై కాల్పులు చేయించిన పార్టీ సభ్యులకు వారిపై ప్రేమ ఎందుకు ఉంటుంది? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముందుగా రద్దు చేసేది పంటలకు ఉచిత విద్యుత్తు సరఫరా పథకం. కాంగ్రెస్ హయాంలో రాత్రిళ్లు పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి ఎంతోమంది తేలు, పాము కాటుకు గురై మృతిచెందారు. కాంగ్రెసోళ్లు ఓట్లడిగేందుకు గ్రామాల్లోకి వస్తే ప్రజలు వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలి.
– పువ్వాడ అజయ్‌కుమార్, రవాణాశాఖ మంత్రి
కరెంట్ అడిగిన పాపానికి రైతులపై అప్పటి సీఎం చంద్రబాబు కాల్పులు జరిపించి, ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు. ఇయ్యాల ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి కూడా ఉచిత కరెంట్ వద్దంటున్నాడు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్ట కొట్టేందుకు చూస్తున్నది. కాంగ్రెస్ నేతలకు మొదటి నుంచి రైతులంటే కండ్ల మంటే. మొన్న ధరణి, ఇప్పుడు ఉచిత కరెంట్ వద్దంటూ మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయం.
– అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి