మహబూబ్నగర్ : రాష్ట్రంలో రెండు చోట్ల జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ( MLC Elections ) సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్గానే భావిస్తున్నామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy) పేర్కొన్నారు. హైద్రాబాద్, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం బీఆర్ఎస్ ( BRS ) పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల వారిలో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. పట్టభద్రులు అందరూ తాజాగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులు గ్రామ, గ్రామానా పట్టభద్రులను కలసి ఓటు నమోదు చేయించాలని కోరారు.
43నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుందని వెల్లడించారు. ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న దృష్ట్యా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయం శిరోధార్యమని అన్నారు. ఎమ్మెల్సీ విజయంతో ప్రభుత్వానికి చెంప చెల్లుమనిపించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.