హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): కోర్టు ఆర్డర్ల సాకుతో ప్రభుత్వ, అటానమస్ కాలేజీలు ఫీజుల పేరుతో జులుం ప్రదర్శించడం, నిరుపేద విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకపోవడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన ముసుగులో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతూ ప్రైవేట్ దోపిడీ పాలన సాగిస్తున్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు ప్రైవేట్ కళాశాలలకు ఇచ్చిన ఊరటను అడ్డుపెట్టుకొని, ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే నిజాం కాలేజీ, కోఠి మహిళా విశ్వవిద్యాలయం, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలతోపాటు ఇతర అటానమస్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి తేవడం హేయమైన చర్య అని పేరొన్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రానందుకు విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడం అక్రమమని అన్నారు. యూజీసీ, ఏఐసీటీఈ, ఉన్నత విద్యామండలి నిబంధనల ప్రకారం ఎలాంటి ఆర్థిక బకాయిల కోసమూ విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను తాకట్టు పెట్టుకోవడానికి వీల్లేదని గుర్తుచేశారు.
చేతిలో సర్టిఫికెట్లు లేక వేలాదిమంది విద్యార్థులు పీజీ, పీహెచ్డీ, విదేశీ విద్య అడ్మిషన్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిల పేరుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడం చట్టవిరుద్ధమని విద్యా శాఖ ద్వారా వెంటనే కఠినమైన ఉత్తర్వులు జారీ చేయాలని చేశారు. ఫీజులతో సంబంధం లేకుండా సర్టిఫికెట్లు అందజేయాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ హెచ్చరించారు.