సిద్దిపేట, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా జై తెలంగాణ అని లేదు. నాడు సమైక్యపాలనలో తెలంగాణ అనే మాటనే నిషేధిస్తే ఇప్పుడు రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ పదం మాయమైంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ సోయిని ఖతం చేస్తారని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఎన్నటికీ తెలంగాణ ఉద్యమకారుడు కాలేడని, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడని విమర్శించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా సోమవారం సిద్దిపేట బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, వంటేరు యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా శర్మ, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితెల సతీశ్‌కుమార్, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీ ప్రసాద్, కవి నందిని సిధారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు, పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి తదితరులతో కలిసి జాతీయ జెండా, బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు. ముందుగా ఉద్యమకారులందరికీ శిరస్సువంచి నమస్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో చేసిన త్యాగాలు, పోరాటాలను గుర్తుచేశారు. నాడు జైల్లో ఉన్నా బాధపడలేదని, ఆ రోజుల్లో ఎదురైన కష్టాలకు భయపడలేదని చెప్పారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలని ఆంధ్రానాయకులు కుట్రలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. కూడవెల్లి, హల్దీవాగు పరివాహక ప్రాంతాల్లో పంటలు ఎండిపోతే, కేసీఆర్ బస్సు యాత్రకు బయలు దేరగానే నీళ్లు వచ్చాయని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది? ప్రస్తుత కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ఆలోచన చేయాలని సూచించారు.
*సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడు..
కొన్ని దశాబ్దాల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని, ఆ కలను నిజం చేసింది కేసీఆర్, బీఅర్ఎస్ పార్టీ అని హరీశ్‌రావు చెప్పారు. ‘సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు’ అని స్పష్టంచేశారు. 1969 ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి విజయాన్నందించింది సిద్దిపేట గడ్డ అని చెప్పారు. ఉద్యమ సమయంలో నందిని సిధారెడ్డి, రమణాచారి, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, దేవీ ప్రసాద్, దివంగత నేత రామలింగారెడ్డి లాంటి నేతల సేవలు మరువలేనివని కొనియాడారు. ఉద్యమంలో నిస్వార్థ సేవలందించిన వారిని గుర్తుంచుకోవడమే నిజమైన పండుగ అని చెప్పారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘రేవంత్‌రెడ్డి అనే వ్యక్తి సీఎం కావొచ్చు.. రేపు అంతకంటే పెద్దపీఠం ఎక్కవచ్చు కానీ, తెలంగాణ ఉద్యమకారుడు అనే కీర్తి రేవంత్‌రెడ్డి పిడికెడు మన్ను బుక్కినా రాదు. సిద్దిపేట నుంచి పోరాడిన ఒక తెలంగాణ ఉద్యమకారుడి పాద ధూళికున్న విలువ కూడా రేవంత్‌రెడ్డికి లేదు’ అని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి ఎప్పటికీ ఉద్యమకారుడు కాలేడు: దేశపతి శ్రీనివాస్
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే కావచ్చు కానీ.. ఎప్పటికీ తెలంగాణ ఉద్యమకారుడు కాలేడని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేటలో ఉండి పోరాడిన ఒక తెలంగాణ పోరాట కార్యకర్త పాద ధూళికున్న విలువ కూడా రేవంత్‌రెడ్డికి లేదని మండిపడ్డారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ఎంతో ప్రాణాలను తీసింది కాంగ్రెస్ పార్టీయే అని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ పార్టీని ఎదుర్కొనేందుకు, దేశంలో లౌకిక విలువలను, సామరస్యాన్ని కాపాడాలని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారని చెప్పారు.
ఉద్యమకారుల సన్మానం ఎంతో గౌరవం: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
సిద్దిపేట అర్బన్, జూన్ 3: తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు ఎంతో కష్టపడి పని చేసిన ఉద్యమకారులను దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సన్మానించుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. సుదీర్ఘ కాలంపాటు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన ఉద్యమకారులను గుర్తుంచుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకోవడంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని పేర్కొన్నారు.
ఉద్యమంలో పాల్గొనడం అదృష్టం: రసమయి బాలకిషన్
తెలంగాణ 14 ఏండ్ల ఉద్యమంలో తాను భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చెప్పారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడినా ఎవరికీ సాధ్యం కానిది కేవలం కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని చెప్పారు.
నాడు జై తెలంగాణ అంటేనే భయపడే పరిస్థితి: నందిని సిధారెడ్డి
1969 ఉద్యమంలో కూడా ఉద్యమాలు చేశామని, తెలంగాణ అంటేనే జైల్లో పెట్టే పరిస్థితులు నాడు ఉండేవని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి గుర్తుచేశారు. సిద్దిపేటలోనే 1996లోనే మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి తెలంగాణ ఆవశ్యకతను వివరించామని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట గడ్డ రక్షణ కవచంగా నిలిచిందని చెప్పారు.14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించామని తెలిపారు.
ఉత్సవాలు ఎంతో సంతోషం:సతీశ్‌కుమార్
నాడు ఉద్యమంలో ఎంతో నిబద్ధతతో పోరాడి తెలంగాణ సాధించామో.. అంతే నిబద్ధతతో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం సాధించి దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు.
ఉద్యమానికి పోరుగడ్డ సిద్దిపేట: దేవీప్రసాద్
తెలంగాణ మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన గడ్డ సిద్దిపేట అని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ చెప్పారు. ఇలాంటి గడ్డమీద ఉద్యమకారులను ఉద్యకారుడైన హరీశ్‌రావు చేతులమీదుగా సన్మానం జరగడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పారు.