శివ్వంపేట, డిసెంబర్ 18 : నర్సాపూర్(Narsapur) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పరిస్థితులు లేవని, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని గోమారం గ్రామంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలు తమతో మాట్లాడిన తీరు చూస్తే, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని వారు మరచిపోలేదని ఆమె అన్నారు.
నియోజకవర్గవ్యాప్తంగా సుమారు 30 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం 50 ఓట్ల తేడాతో ఓడిపోవడం వెనుక అంతర్గత కారణాలు ఉన్నాయని, తమ పార్టీలోనే కొందరు డబుల్ నామినేషన్లు వేసి పోటీ చేయడం వల్ల నష్టం జరిగిందని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు పోలీసుల అండతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కార్యకర్తలను, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. ఈ అరాచకాల కారణంగానే కొన్ని కీలక సీట్లు చేజారాయని, భయాందోళన వాతావరణంలోనే కాంగ్రెస్ కొద్దిపాటి స్థానాలు సాధించిందని పేర్కొన్నారు.
కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు పోలీసుల సహకారంతో దాడులు, బెదిరింపులు జరగడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా అభివర్ణించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరిస్తే తాము మౌనంగా ఉండబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణకు, పోరాటాలకు ప్రతీక అని, కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల పక్షాన నిలబడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న విధానాలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పారని, ఎవరికి ఏ కష్టం వచ్చినా పార్టీ భేదం లేకుండా సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
అంతకుముందు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రమణ గౌడ్ మాట్లాడుతూ శివ్వంపేట మండలంలో పార్టీకి అధిక స్థానాలు దక్కేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, సీనియర్ నాయకులు సింగయపల్లి గోపి సహా కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.