కొడంగల్, మే 18 : రైతు బాగుంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందనే ధ్యాసే సీఎం రేవంత్‌రెడ్డికి లేదని, కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి అటు ప్రజలకు ఇటు రైతులకు అరిగోస తప్పడం లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. సోమవారం దౌల్తాబాద్ మండలంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కోతలు ప్రారంభమై నెలరోజులు దాటినా వడ్లను సేకరించడంలో సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని దుయ్యబట్టారు.
అన్నదాతలు రోడ్లు, కల్లాల్లో వడ్లను రాశులుగా పోసుకుని రాత్రీపగలు అనే తేడా లేకుండా ఎప్పుడు కాంటా చేస్తారా లని పడిగాపులు కాస్తున్నారని.. కొన్ని ప్రాంతాల్లో వడ్ల కుప్పలపైనే రైతన్న ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనలు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలకు మొలకెత్తిన ధాన్యాన్ని చూసి అన్నదాతలు రోదిస్తుంటే ఏ నాయకుడు కానీ అధికారి కానీ కనీసం పలకరించడంలేదన్నారు. సీఎం సొంత జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. ఏ రోడ్డును చూసినా.. కల్లాలను చూసినా ధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయన్నారు. సీఎం సొంత సెగ్మెంట్లోనే ఈ దుస్థితి ఉందంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునన్నారు.
కొడంగల్ ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి.. సీఎం పీఠాన్ని అధిరోహించిన రేవంత్‌రెడ్డికి సొంత నియోజకవర్గ ప్రజల కష్టాలు కనిపించడం లేదా ప్రశ్నించారు. గన్నీ బ్యాగుల కొరతతో రైతులు ధాన్యాన్ని అమ్మలేకపోతున్నారని.. కొన్ని గ్రామాల్లో ఇప్పటి వరకూ కొనుగోలు కేంద్రాలనే ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన కొన్ని కేంద్రాల్లో గన్నీ బ్యాగులు కాంగ్రెస్ నాయకులు, మధ్యవర్తులకే పరిమిత అవుతు న్నాయని.. సాధారణ రైతులకు టోకెన్లు ఇచ్చినా అందని పరిస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. గతంలో రెండుసార్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బొంరాస్‌పేటలో ధర్నా చేయడంతో వెంటనే కాంగ్రెస్ నాయకులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని.. ప్రస్తుత ధర్నాతో దౌల్తాబాద్‌లోని సెంటర్లకు గన్నీ బ్యాగులు సరఫరా అవుతారన్నారు.

గత కేసీఆర్ పాలనలో ధాన్యం కోతలకు రెండు నెలల ముందే పక్కా ప్రణాళిక ఉండేదని.. ఎంత ధాన్యం దిగుబడి వస్తుంది.. ఎన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.. ఎన్ని గన్నీ బ్యాగులు అవసరం తదితర వాటిపై అధికారులతో ముందుగానే రివ్యూ జరిగి పూర్తి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చే వారన్నారు. కరోనా వంటి కష్ట కాలంలోనూ మాజీ సీఎం కేసీఆర్ రైతు సంక్షేమాన్ని వీడలేదని, కల్లాల వద్దే ధాన్యం కొనుగోళ్లు చేపట్టి అన్నదాతను ఆదుకున్నట్టు గుర్తు చేశారు.
అప్పట్లో వర్షాలు పడ్డప్పుడే రైతుబంధు రైతుబ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేదని.. ఇప్పటి రేవంత్ సర్కార్‌లో కేసీఆర్, కేటీఆర్ మీ టింగ్ పెట్టినప్పుడు లేదా ఎంపీ ఎన్నికల సమయంలోనే రెండుసార్లు రైతుభరోసాను పంపిణీ చేశారని విమర్శించారు. రెండోసారి రైతుభరోసా కేవలం ఒక ఎకరానికి మాత్రమే పరిమితమైందన్నారు. ఈ ప్రభుత్వానికి ఎటువంటి ప్రణాళిక లేదని, ఎంత ధాన్యం దిగుబడి వస్తుంది.. కొనుగోళ్లు ఏ విధంగా చేపట్టాలి, రైతుభరోసా ఎప్పుడు అందించాలనే ధ్యాసే రేవంత్‌రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం జరుగుతున్న కొనుగోళ్లు అన్నదాతకు నష్టం కలిగించేలా ఉన్నాయని.. క్వింటాల్‌కు ఏకంగా 13కిలోల వరకు తరుగు తీస్తున్నట్టు రైతులు పేర్కొంటున్నారన్నారు. రైతుకు గన్నీ బ్యాగులు అందించేందుకు ప్రతి బ్యాగుకు రూ.50 చొప్పున ముందుగానే డిపాజిట్ చేయాల్సిన దుస్థితి రైతుకు ఏర్పడిందన్నారు.
సంచి ఎత్తాలన్నా.. దించాలన్నా పైసలతోనే కూడుకున్నదని.. దాంతో ఎందుకు వ్యవసాయం చేస్తున్నా మా..? అని అన్నదాత దిగాలు చెందే పరిస్థితి వచ్చిందన్నారు. అలవి కాని హామీలిచ్చి పవర్లోకి వచ్చిన రేవంత్‌రెడ్డి.. ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశాడని మండిపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, కౌన్సిలర్ వాణిశ్రీమధు యాదవ్, పార్టీ నియోజకవర్గ నాయకులు కోట్ల మైహిపాల్, మధుసూదన్‌రావు యాదవ్, కోట్ల యాదగిరి, శేరి నారాయణరెడ్డి, మైపాల్‌రెడ్డి, లగచెర్ల సురేశ్, భీములు, నరేశ్, రవిగౌడ్, ఫకీరప్ప, సోంనాథ్ రైతులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ధర్నాతో కదిలిన యంత్రాంగం
రైతు పక్షాన వడ్ల కొనుగోళ్లపై దౌల్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాతో అధికార యత్రాంగం కదిలింది. బొంరాస్‌పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లోని కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లులను కలెక్టర్, ఎస్పీతోపాటు అధికారులు పరిశీలించినట్టు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు.
కొడంగల్‌పై సవతి తల్లి ప్రేమ
కొడంగల్ ప్రజలు రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి సీఎంగా ఉన్నత పదవిని అందించినా.. ఆయన మాత్రం నియోజకవర్గంపై సవతి తల్లి ప్రేమను చూపుతున్నారు. సీఎంగా ఉండి కూడా కొడంగల్ అభ్యున్నతికి కృషి చేయడంలేదు. సొంత నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయలేని వ్యక్తి రాష్ర్టానికి ఏమి ఒరగబెడతారు. సెగ్మెంట్ ప్రజలు నెలరోజులకు పైగా వడ్ల కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారంటే సీఎంకు ఎంత సిగ్గు చేటో ఓ సారి గమనించాలి. రోడ్లపై.. కల్లాల్లో వడ్లను ఆరబెట్టుకుని.. ఎప్పుడు కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెడతారో అని అన్నదాతలు రోజుల తరబడి పడిగాపులు కాస్తు న్నా సీఎంకు కనువిప్పు కలుగకపోవడం దారుణం. సెగ్మెంట్లోని ఏ గ్రామానైనా మీరే ఎంచుకోండి.. మీతోపాటు మా బీఆర్ఎస్ నాయకులం వస్తాం.. రైతును కలిసి వారి పరిస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దామని సవాల్ విసిరారు.
-నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ
స్కాంలు, భూ కబ్జాలపైనే ఆయనకు ధ్యాస..
రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. ఆయనకు ఎల్లప్పుడూ స్కాంలు, భూకబ్జాలు, రాహుల్‌కు కప్పం ఏ విధంగా చెల్లించాలనే ధ్యాసే. రైతులపై ప్రేమేలేదు. ఎవరి భూములను లాక్కోందాం, రియల్ఎస్టేట్ ఏ విధంగా చేద్దామనే యత్నమే. ప్రభుత్వం వచ్చి 30 నెలలు కావొస్తున్నా సెగ్మెంట్లో ఒక్క పరిశ్రమను ఏర్పాటు చేయలేదు. లగచర్ల, అప్పాయిపల్లిలలో రైతుల నుంచి బలవంతంగా భూములను లాగేసుకున్నారు.
కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్‌తో నియోజవర్గానికి సాగునీరు తీసుకొస్తామని గొప్పలు చెప్పడమే తప్ప.. నేటికీ ఆ పనుల జాడే కనిపించడం లేదు. 90 శాతం పూర్తైన పాలమూరు-రంగారెడ్డి కాల్వల పనులను చేట్టి ఉంటే ఇప్పటికే కొడంగల్‌కు తాగు, సాగునీరు వచ్చేది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనేవరకూ పోరాడుతాం. మరో రెండు, మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకుంటే కొడంగల్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ధాన్యం రాశులు నింపడం ఖాయం. సొంత సెగ్మెంట్లో రూ.7 కోట్ల వేరుశనగ స్కాం జరిగితే సీఎంకు సోయేలేదు. స్కాంపై విచారణ జరిపి దోషులను శిక్షించాలి.
-పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడంగల్
వెయిటింగ్ చార్టీలతో గోస పడుతున్నాం..
కొనుగోలు కేంద్రానికి ట్రాక్టర్ ద్వారా సంచులు నింపుకొని వచ్చా. నాలుగు రోజులు అవుతున్నా ఇప్పటికీ కొనడం లేదు. ట్రాక్టర్‌కు ప్రతిరోజూ రూ.1000 వెయిటింట్ చార్టి కట్టాల్సి వస్తున్నది. డబ్బులు ఎప్పుడు ఇచ్చినా సరే కనీసం గోదాంలో వడ్లను నిల్వ చేస్తే కనీసం ట్రాక్టర్ వెయిటింగ్ చార్జిలైనా మిగులుతాయని ప్రధేపడ్డా ఫలితం లేదు. ఎప్పుడు కొంటారో.. ఈ బాధ ఎప్పుడు తీరుతుందో అర్థం కావడం లేదు.
-కిష్టప్ప, రైతు, దౌల్తాబాద్
సబితమ్మ వస్తుందని.. రాత్రికి రాత్రే సంచులిచ్చారు..
గత పది రోజుల కిందట ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. సంచుల్లేవని.. అవి వచ్చే వరకు నిరీక్షించాలని కేంద్రం నిర్వాహకులు చెప్పారు. కానీ, సబితమ్మ ధర్నా చేసేందుకు వస్తుందని తెలుసుకొని రాత్రికి రాత్రే సంచులను పంపించారు. గతంలో కోతలకు ముందుగానే సంచులు వచ్చేవి. కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లగానే కాంటా చేసి గోదాంలో దించుకొనే వారు. అప్పట్లో అమ్ముకాలపై మాకు ఎటువంటి బాధ కలుగలేదు. కానీ, కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి అన్ని కష్టాలే..
-రాంరెడ్డి, రైతు, చిన్న ఫసల్వాద్, దౌల్తాబాద్
రేవంత్‌రెడ్డితో మాకేం లాభం లేదు..
రేవంత్‌రెడ్డి సీఎం అయితే మా కొడంగల్ రైతుల బతు కులు బాగుపడతాయని అనుకున్నా. కానీ ఆయన సీఎం అయినా ఏం లాభం లేదు. నాకున్న రెండెకరాల భూమి లో వడ్లు పండించా. ఇప్పుడు అమ్ముకుందామంటే ఏ దారి లేదు. కుప్పల వద్ద కాపలా ఉండేవారు లేక తక్కువ ధరకే దళారులకు విక్రయించా. ఉన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెంది ఏడాది అవుతున్నది. ఆయన పేరున రావాల్సిన రైతుబీమా ఇప్పటికీ రాలేదు. కేసీఆర్ కాలంలో పంట చేతికొచ్చిన తర్వాత అమ్ముకునేందుకు ఏ బాధ ఉండేది కాదు.
-మల్కమ్మ, మహిళారైతు, దౌల్తాబాద్
సంచులకు రూ.50 డిపాజిట్ చేయాలంటా..?
వడ్లు అమ్ముకునేందుకు నానా తంటాలు పడుతున్నాం. గన్నీ బ్యాగులు కావాలంటే ముందుగా రూ.50 డిపాజిట్ చేయాలంటా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఉచితంగానే సంచులు ఇచ్చారు. డిపాజిట్ కట్టినా సంచు లు దొరకడం లేదు. తూకంలో క్వింటాల్‌కు 13 కిలోల తరుగు తీస్తుండ్రు.. ఇట్లా అయితే రైతుకు మిగిలేదేంది. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు.
-భీమప్ప, రైతు, దౌల్తాబాద్