ముషీరాబాద్ : ముషీరాబాద్ పఠాన్‌బస్తీలో మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి సౌకర్యాల కల్పనకు తాను ఎంతో కాలంగా కష్టపడి పని చేస్తే ఈ మధ్యకాలంలో కొంతమంది వచ్చి మేం చేయించామంటూ ప్రచారం చేసుకోవడం శోచనీయమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టెండర్ పనులు పూర్తవుతున్న క్రమంలో లెటర్స్ ఇచ్చి తాముచేయించినట్లుగా ప్రజల్లో చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సోమవారం ముషీరాబాద్ డివిజన్ పఠాన్‌బస్తీలో రూ 22.75 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ తాము చేయించిన పనులను వారి ఖాతాలో వేసుకుంటూ భరితెగించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పఠాన్బస్తీ డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం తాను రోడ్డు వేయకముందే నిధులు మంజూరు చేయించానని, గుత్తేదారులు అగకుండా రోడ్డు పనులు చేపట్టడంతో పైపులైన్ పనులు పూర్తి చేయలేకపోయామని స్పష్టం చేశారు.
కొత్తగావేసిన రోడ్డును తవ్వకూడదనే తాము పనులు నిలిపి వేశామని, ఇప్పుడు పనులు ప్రారంభించడానికి సిద్ధమైతే కొందరు ఇంటింటికి వెళ్లి మా ఎంపి, కార్పొరేటర్ చేయించినట్లు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. స్థానికులను అడిగితే ఎవరు చేయించారో తెలుస్తుందన్నారు. చాలా కాలంగా ఎదురవుతున్న పఠాన్బస్తీ డ్రైనేజీ సమస్య పరిష్కారమౌతుందని, త్వరితగతిన పనులు ప్రారంభిచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ కార్పొరేటర్ ఎం.సుప్రియ, జలమండలి డీజీఎం మోహన్‌రాజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, టీ.సోమసుందర్, ఎడ్ల హరిబాబు యాదవ్, శ్రీధర్‌రెడ్డి, డి.శివముదిరాజ్, శ్రీధర్ చారి, బి.శ్రీనివాస్‌రెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్, ముదిగొండ మురళీ, దీన్‌దయాల్‌రెడ్డి, బాబురావు, మాజీ కార్పొరేటర్ కల్పనాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.