ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏఐ యుగంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి ‘క్షుద్ర పూజలు’ వంటి మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్‌రావు విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలతో రాష్ట్రాన్ని రాతియుగం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలు అన్నీ అర్థం చేసుకునే కాలమిదని, ముఖ్యమంత్రి చెప్పే మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాణిక్‌రావు మాట్లాడుతూ.. సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు జోకర్ మాటల్లా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ప్రశ్నిస్తుంటే రేవంత్‌రెడ్డి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. బట్ట గాల్చి మీదేస్తే అబద్ధం నిజం కాదని, ఆరోపణలు చేసినంత మాత్రాన వాస్తవాలు మారవని అన్నారు.
గతంలో జహీరాబాద్‌కు రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చారని, వాటిలో ఎన్ని అమలు చేశారో చెప్పాలని మాణిక్‌రావు డిమాండ్ చేశారు. మాట తప్పిన రేవంత్‌రెడ్డి మాటలను ప్రజలు ఇప్పుడు విశ్వసించడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అందరి ముందు ‘సిగ్గులేనోడు’ అంటూ సంబోధించడం సరైనదేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగ సభల్లో ఇలాంటి భాష ఉపయోగించడం సరికాదన్నారు.
కాంగ్రెస్‌లో టికెట్లు రాహుల్‌గాంధీ ఇస్తారని రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, మరి ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎందుకు ఉన్నారని మాణిక్‌రావు ప్రశ్నించారు. ఖర్గే దళితుడు కావడం వల్లే ఆయనను రేవంత్‌రెడ్డి అవమానిస్తున్నారా అని నిలదీశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి తన బాధ్యతలను మర్చిపోయి ఇంకా పీసీసీ అధ్యక్షుడిలాగే మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు, యువత సమస్యలను పట్టించుకోకుండా తన అన్నదమ్ముల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వంచిస్తోందని మాణిక్‌రావు ఆరోపించారు. ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా ప్రజలు నమ్మరని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు.