హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నిర్వహించేది ప్రజాదర్బార్ కాదని, అది పొలిటికల్ దర్బార్ అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. గవర్నర్ ప్రజా దర్బార్‌కు తాము జవాబుదారీ కాదని, ప్రజలకే తాము జవాబుదారులమని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి విశేష ప్రజాదరణ ఉందని, దీన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలో శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో కేపీ వివేకానంద మాట్లాడారు.
ప్రతీ సోమవారం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాదర్బార్ (గ్రీవెన్స్‌సెల్) నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కేపీ వివేకానంద గుర్తుచేశారు. రాజ్యాంగ వ్యవస్థలపై సీఎం కేసీఆర్‌కు అపారమైన గౌరవం ఉందని తెలిపారు. ఎవరికైనా వారు అనుసరించే వైఖరిని బట్టి గౌరవాలు దక్కుతాయని చెప్పారు. గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్లతో ప్రజాదర్బార్లు నిర్వహిస్తారా?.. ఒకవేళ ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రజాదర్బార్ నిర్వహిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు మంచిదా? అని కేపీ వివేకానంద ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ కమల బేనివాల్ ప్రజాదర్బార్ నిర్వహిస్తే ఏంజరిగిందో గుర్తులేదా? అని ప్రశ్నించారు. రాజకీయాల నుంచి వచ్చిన వాళ్లను గవర్నర్లుగా నియమిస్తే ప్రజాదర్బార్లు పెడతారని, రాజకీయేతర రంగాల వారిని గవర్నర్లుగా నియమించాలని, కమల బేనివాల్‌ను తొలగించాలని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నరేంద్ర మోదీ లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద గుర్తుచేశారు.
2014లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర గవర్నర్ అజీజ్ ఖురేషి రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారనే ఆరోపణలతో పదవి నుంచి తొలగించారని కేపీ వివేకానంద గుర్తుచేశారు. తమకు అనుకూలమైతే ఒకలా …లేదంటే మరోలా బీజేపీ ద్వంద్వ వైఖరులు అనుసరిస్తుందని మండిపడ్డారు. ఈ ద్వంద్వ వైఖరికి ఆద్యుడు..బాధ్యుడు మోదీ అని పేర్కొన్నారు. బీజేపీ నేతలు పట్టుబట్టినట్టుగా తామేమీ గవర్నర్‌ను తొలగించాలని డిమాండ్ చేయడం లేదని, అదే సమయంలో లక్ష్మణరేఖ దాటకూడదని మాత్రం సూచిస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఆదరణతో 2018లో 88 ఎమ్మెల్యేలు గెలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎవరు ఎలాంటి కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ ప్రజాదరణను చెదరగొట్టలేవని స్పష్టంచేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక అన్ని పార్టీలు ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సెక్షన్ 8ను మళ్లీ తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 8ను ఏ పరిస్థితుల్లో అమలు చేస్తారో కూడా తెలియని అజ్ఞాని రేవంత్ అని కేపీ వివేకానంద విమర్శించారు.