బంజారాహిల్స్,మార్చి 23: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి పూల అలంకరణ చేసే బాధ్యతను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కుటుంబసభ్యులు చేపట్టారు. ఈ నెల 28న ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ వేడుకల సందర్భంగా పూల అలంకరణ ఏర్పాట్లపై సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయితో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం చర్చించారు. టీటీడీలో పూల అలంకరణ చేసే సుందరేశన్ కళాకారుడితో ఆలయంలో పూల అలంకరణ చేయిస్తున్నామని, ఇలాంటి అవకాశం తమ కుటుంబానికి దక్కడం పూర్వజన్మ సుకృతమని ఎమ్మెల్యే దానం పేర్కొన్నారు. స్వామి వారి సత్కార్యంలో పాలుపంచుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 20 అరుదైన రకాల పూలను విదేశాలనుంచి తెప్పిస్తున్నామని వెల్లడించారు. 5నుంచి 6టన్నుల పూలను అలంకరణకు ఉపయోగిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.