– పట్టించుకోని అధికార యంత్రాంగం
కారేపల్లి, మే 18 : గ్రామాల్లో పట్టణాలలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకాన్ని సంకల్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల దాహార్తిని తీర్చే తాగునీటికి పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించింది. తద్వారా కొన్ని వేల కిలోమీటర్ల పొడవునా పైపులైన్లను వేసి ప్రతి గ్రామానికి తాగునీటి సరఫరాను చేసేందుకు శ్రీకారం చుట్టింది. దాంతో గడిచిన పదేళ్లలో గ్రామాలలో ఎక్కడా కూడా ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తలేదు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచినీళ్ల కోసం దశాబ్ద కాలం తర్వాత మళ్లీ ప్రజలు రోడ్లపైకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా తాగునీటి వృథాను అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా మిషన్ భగీరథ తాగునీరు వృథాగా పోతుంది. అనేక చోట్ల పైపుల పగుళ్లు, లీకేజీలు ఏర్పడడం వల్ల శుద్ధమైన తాగునీరు నిరుపయోగమవుతుంది. ఈ విషయం అధికారులకు తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కారేపల్లిలో వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో కూల్చివేసిన పాత వాటర్ ట్యాంక్ ప్రదేశంలో మిషన్ భగీరథ పైప్ పగిలి నీళ్లు వృథాగా పోతున్నాయి. ఇప్పటికే పలు గ్రామాలలో తాగునీటి సమస్య ఎదురవుతుంది. లీకైన పైపులైనుకు వెంటనే మరమ్మతులు చేసి తాగునీటి సమస్య లేకుండా చూడాలని మండల కేంద్ర ప్రజలు కోరుతున్నారు. మిషన్ భగీరథ అధికారులకు ప్రజలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని సమీప కాలనీవాసులు వాపోతున్నారు. లీకేజీల ద్వారా వృథాగా పారుతున్న నీళ్లలో పందులు స్పైరవిహారం చేస్తున్నాయి. అదేవిధంగా గేదెలు, కుక్కలు బొర్లుతున్నాయి. దీంతో కలుషితమైన లీకేజీ వాటర్ తో తాగునీరు అపరిశుభ్రతగా మారుతుంది.

కారేపల్లిలో వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు
మిషన్ భగీరథ అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేందర్ ను నమస్తే తెలంగాణ వివరణ అడగగా కారేపల్లి మండల కేంద్రంలో గల పాత వాటర్ ట్యాంక్ ప్రదేశంలో తాగునీరు వృథాగా పోతున్న విషయం మూడు రోజుల క్రితమే తన దృష్టికి వచ్చిందన్నారు. పగిలిన పైపులైన్లకు మరమ్మతులు చేపట్టాలని స్థానిక సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి చెప్పామన్నారు. కొద్ది రోజుల్లోనే వాటర్ లీకేజ్ సమస్యకు పరిష్కారం చూపిస్తామని ఆయన పేర్కొన్నారు.