హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో కోతలు విధించేందుకు సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు మహిళా సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, హౌస్ కీపింగ్ ఉద్యోగులను డెయిలీవేజ్ కార్మికులుగా గుర్తించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ శాఖ ఉన్నతాధికారి సూచన మేరకే ఈ విధానాన్ని అమలుచేయాలని నిశ్చయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విధానాన్ని క్రమేణా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల సొసైటీ ల్లోనూ వర్తింపజేసే ప్రమాదమున్నదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 204 మైనార్టీ గురుకుల విద్యా సంస్థల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో సుమారు 5000 మంది మహిళా సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా రూ.12వేల నుంచి రూ.19 వేల జీతాలు అందజేస్తున్నారు. కొన్నేళ్లుగా ఏడాదిలో 10 నెలల పనికాలానికే జీతం ఇస్తూ రెండు నెలలు కోత విధిస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక భారం నుంచి తప్పించుకొనేందుకు వీరిని డెయిలీ వేజ్ కార్మికులుగా గుర్తించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
అంటే విధులకు హాజరైన పనిదినాలకు మాత్రమే వేతనం చెల్లిస్తారు. అంటే రూ.15 వేల వేతనం తీసుకుంటున్న ఒక ఉద్యోగికి ప్రతిరోజూ రూ.500 వేతనంగా పరిగణి స్తారు. సదరు ఉద్యోగి పనిచేసిన రోజులకే వేతనం చెల్లిస్తారు. అయితే ఏజెన్సీల గుప్పిట్లో నుంచి తప్పించేందుకే ఈ విధానాన్ని అమలు చేస్తామని చెబుతున్నప్పటికీ వాస్తవంగా వేతన భారం నుంచి తప్పించుకొనేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఔట్సోర్సింగ్ సిబ్బందిని డెయిలీవేజ్ కార్మికులుగా పరిగణించడంద్వారా ఉద్యోగులు తమ హక్కులు కోల్పోవడమే కాక ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యానికి దూరమవుతారు. భవిష్య త్లో పింఛన్, గ్రాట్యుటీ సౌకర్యాలతోపాటు ఉద్యోగ విరమణ అనంతరం ప్రయోజనలు దక్కవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.