హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : బయటి రాష్ట్రాల నుంచి చేప పిల్లలను కొనకుండా చేపల సీడ్‌ను మనమే ఉత్పత్తి చేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట్రంలోని జలాశయాలు, చెరువుల్లో వేయడానికి ఏటా 85 కోట్ల చేప పిల్లలు అవసరంకాగా మనదగ్గర కేవలం 15 కోట్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. మిగతా 70 కోట్ల చేప పిల్లలను పక రాష్ట్రం నుంచి కొంటున్నట్టు వెల్లడించారు.
బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ విద్యార్థులు గురువారం సచివాలయంలో మంత్రిని కలిసి పలు సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతున్నదని, వీరికి ప్రోత్సాహకాలు అందిస్తే మరింత ఉత్పత్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. చేప పిల్లల ఉత్పత్తిని పెంచేందుకు మత్స్యకళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని తెలిపారు. అలాగే మత్స్యశాఖలో రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సమర్పించాలని మంత్రి శ్రీహరి అధికారులను ఆదేశించారు.