హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఫిన్లాండ్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థి మిస్సింగ్ కేసు దర్యాప్తును ఆ దేశ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు గురువారం నివేదించింది. దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఫిన్లాండ్ అధికారులను కోరినట్టు చెప్పింది. ఫిన్లాండ్లోని ఎల్‌యూటీ యూనివర్సిటీలో చదువుతున్న హయత్‌నగర్‌కు చెందిన మణిదీప్ మే 6 నుంచి కనిపించడంలేదని, ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అతని తల్లిదండ్రులు జీ మమత, ముత్యంరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ఈ కేసును గత నెల 22న ఫిన్లాండ్ జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించినట్టు కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. విద్యార్థి కుటుంబానికి దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు చేరవేసేలా చర్యలు తీసుకున్నామని, దర్యాప్తు పురోగతిపై వివరాలు సమర్పించేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, దర్యాప్తు పురోగతి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.