హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి, ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈవో అలెక్స్ కిప్మాన్ల తాజా సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. హైదరాబాద్ నగరంలో ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించేందుకు ఈ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, అనలాగ్, మేఘా ఇంజినీరింగ్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అయితే, ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చిన వెంటనే, ప్రతిపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కిప్మాన్ గత చరిత్రను ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.
సీఎం రేవంత్‌రెడ్డి ఎవరితోనైతే కరచాలనం చేస్తున్నారో, ఆ వ్యక్తి సాధారణమైన వాడు కాదని కిప్మాన్ను ఉద్దేశించి క్రిషాంక్ ఆరోపించారు. ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్‌లో హోలోలెన్స్ విభాగ అధిపతిగా పనిచేసిన అలెక్స్ కిప్మాన్, అకడ మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణల కారణంగానే ఆ సంస్థ నుంచి ఉద్వాసనకు గురయ్యాడని పేరొన్నారు. ఈ ఉదంతంపై ప్రముఖ అంతర్జాతీయ సాంకేతిక వార్తా సంస్థ ‘ది వెర్జ్’ గతంలో ప్రచురించిన కథనాన్ని క్రిషాంక్ షేర్ చేశారు. ‘సీఎం ఎవరికి షేక్‌హ్యాండ్ ఇస్తున్నారు? అని ప్రశ్నించారు.
ఒకవైపు రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్న తరుణంలో, ఇలాంటి వేధింపుల ఆరోపణల ట్రాక్ రికార్డ్ ఉన్న టెక్నాలజిస్ట్తో సీఎం అధికారిక ఒప్పందాలు కుదుర్చుకోవడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ శ్రేణులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.