వరంగల్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గిరిజనులకు 12,304 కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయిచింది.
అయితే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.8,400 కోట్ల బడ్జెట్ కేటాయించడం గిరిజనుల పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 8.8శాతం గిరిజనులు అంటే కనీసం వీరి సంఖ్య 12 నుంచి 13 కోట్లకు ఉంటే వారికి ఇంత తక్కువ కేటాయింపులు చేయడాన్ని ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్న బీజేపీనేతలకు ప్రజలే సరైన బుద్ధి చెప్తారన్నారు.
నర్సంపేటలో గురువారం గిరిజన బాలుర గురుకుల జూనియర్ కాలేజీని జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని గురుకులాలు పెట్టడమే కాకుండా మహిళలు విద్యను మధ్యలో మానేయొద్దని వారికి ప్రత్యేకంగా గిరిజన గురుకులాలు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నర్సంపేటలో కూడా గిరిజన మహిళా డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో గిరిజనులు అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే మార్గమని భావించినసీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖలోనే కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన గురుకుల విద్య అందుబాటులో ఉందన్నారు.
‘మన ఊరు మన బడి’ కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలలను ఇంగ్లీషు మీడియంలోకి మార్చుతున్నామని మంత్రి తెలిపారు.