రఘునాథపాలెం, నవంబర్ 15: పాఠశాలలకు విద్యార్థులను బస్సుల్లో తరలించడం కేవలం ప్రైవేటు విద్యాసంస్థల్లోనే చూస్తుంటాం. ప్రస్తుతం ప్రభుత్వ బడులకు వెళ్లే విద్యార్థులకూ బస్సు సౌక ర్యం చేరువైంది. ఈ అవకాశం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దక్కింది. ఖ మ్మం నగరంలోని 8వ డివిజన్ పువ్వాడ అజయ్నగర్లో ఉంటున్న 45 మంది నిరుపేదల పిల్లలు వీ వెంకటాయపాలెం పాఠశాలలో చదువుకుంటున్నారు.
వీరున్న ప్రాంతం నుంచి పాఠశాల 6 కిలోమీటర్ల దూరం ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక టీఆర్ఎస్ నా యకుల సాయంతో విద్యార్థుల తల్లిదండ్రులు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన మంత్రి.. వెంటనే ఖమ్మం ఆర్టీసీ అధికారులతో చర్చించి బస్సు సౌకర్యం కల్పించారు. సోమవారం విద్యార్థులను ఎక్కించుకునేందుకు ఆర్టీసీ బస్సు రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
కోటపల్లి: మంచిర్యాల జిల్లా కోటపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల ఇబ్బందులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. చెన్నూర్ నుంచి కోటపల్లికి ఉదయం పూట ఆర్టీసీ బస్సు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న వీడియోను కోటపల్లి ‘కస్తూర్బా’ టీచర్ భారతి ఎండీకి ట్వీట్ చేశారు. స్పందించిన సజ్జనార్ అదనపు బస్సు నడిపిస్తామని హామీ ఇచ్చారు.