మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రంలో పండించిన వడ్లను కొనే వరకు కొట్లాడుతామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రేపు ఢిల్లీలో రైతులకు మద్దతుగా నిర్వహించే రైతు దీక్షకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి రైతులు, ప్రజాప్రతినిధులతో మంత్రి ఆదివారం ఢిల్లీ బయలు దేరారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..సోమవారం ఢిల్లీలో జరిగే రైతు దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగి రాకతప్పదన్నారు.
రైతు దీక్షలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో రైతులు ఢిల్లీ వస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులను కూడగట్టి ఢిల్లీలో జరిగే రైతు దీక్ష కేంద్రం దిమ్మ తిరిగేలా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బీజేపీ, కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయంపై అగ్రహంగా ఉన్నారనిపేర్కొన్నారు. రైతుల అగ్రహనికి గురైతే రాష్ట్రంలో బీజేపీ నాయకులు తిరగలేని పరిస్థితి ఉంటుందన్నారు.
బీజేపీ నాయకులు పొంతన లేని మాటాలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ నాయకులు చేసే ఆరోపణలను ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్రంలో బీజేపీ పార్టీ తుడిచి పెట్టుక పోవడం ఖాయమని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీలు కలిసి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుక రావాలని మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు.