నీలగిరి, జనవరి 25: తండ్రిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో పూలు అమ్ముకొంటున్న ఓ యువతికి నేనున్నానంటూ మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ప్రభుత్వ ఉద్యోగం కల్పించి కొండంత ధైర్యం నింపారు. గతేడాది డిసెంబర్ 31న నల్లగొండ పట్టణంలో పర్యటించిన మంత్రి.. పట్టణంలో పాదయాత్రగా వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకొన్నారు. ఆ సమయంలో రోడ్డు పక్కన పూలు అమ్ముకొంటున్న కరిష్మాను చూసి పలుకరించారు. ఏం చదువుకున్నావమ్మా? అని మంత్రి ప్రశ్నించగా.. తాను నర్సింగ్ కోర్సు పూర్తి చేశానని చెప్పింది. తమది రామన్నపేట అని, తన తండ్రి లింగమయ్య మూడేండ్ల క్రితం చనిపోయాడని మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. తల్లితోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లమని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా పూలు అమ్ముకుంటున్నానని చెప్పింది. చలించిన కేటీఆర్.. ఆమెకు ఉద్యోగం కల్పిస్తానని భరోసానిచ్చి.. యువతి వివరాలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరిష్మాకు జిల్లా యంత్రాంగం తరఫున గుర్రంపోడ్ మండలంలో ఏఎన్ఎంగా పోస్టింగ్ ఇచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే కంచర్ల భుపాల్‌రెడ్డి ఆమెకు నియామక పత్రాలను అందజేశారు. తన కుటుంబానికి అండగా నిలిచి ఉద్యోగం కల్పించిన మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది.